టీడీఎల్పీ ఉప నాయకుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని ఏపీ హైకోర్టు బుధవారం నాడు ఆదేశించింది.గుంటూరు పట్టణంలోని రమేష్ ఆసుపత్రికి అచ్చెన్నాయుడిని తరలించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

అచ్చెన్నాయుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడాన్ని ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడును ఏ ఆసుపత్రికి తరలించాలనేది  ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండ్(జీజీహెచ్ ఆసుపత్రి) నిర్ధారించాలని ప్రభుత్వ తరపున న్యాయవాది వాదించారు.

also read:హైకోర్టును ఆశ్రయించిన అచ్చెన్నాయుడు: రేపు విచారణ

గుంటూరు పట్టణంలోని రమేష్ ఆసుపత్రికి అచ్చెన్నాయుడిని తరలించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 1వ తేదీన జీజీహెచ్ ఆసుపత్రి నుండి అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేశారు. వెంటనే అతడిని గుంటూరు జైలుకు తరలించారు. తన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో తనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ అచ్చెన్నాయుడు ఈ నెల 2వ తేదీన ఏపీ హైకోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై ఈ నెల 3వ తేదీన ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. ఈ  విషయమై హైకోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. మరో వైపు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ కొట్టివేయడంతో హైకోర్టులో అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై కూడ కోర్టులో ఇరువైపులా వాదనలు పూర్తైన విషయం తెలిసిందే.