ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల కుంభకోణంలో ఏసీబీ అధికారుల అదుపులో ఉన్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడికి బెయిల్ ఇప్పించేందుకు ఆయన తరపు న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో విజయవాడ ఏసీబీ కోర్టుకు ఆయన లాయర్లు చేరుకున్నారు. బెయిల్ పిటిషన్‌పై ఆయనతో సంతకాలు తీసుకున్నారు లాయర్ సుబ్బారావు. అయితే న్యాయవాదులకి అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Also Read:ఏసీబీ కార్యాలయానికి అచ్చెన్నాయుడు.. ఏం జరుగుతుందో చూద్దామంటూ వ్యాఖ్యలు (వీడియో)

దీంతో న్యాయవాదులు వారితో వాగ్వాదానికి దిగి, చివరికి చేసేదిలేక వెనుదిరిగి వెళ్లిపోయారు. అనంతరం శాంతించిన పోలీసులు.. మళ్లీ లాయర్లను వెనక్కి పిలిచి సంతకాలు తీసుకునేందుకు అచ్చెన్నాయుడి వద్దకు పంపారు. ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్‌పై అచ్చెన్నాయుడు సంతకాలు చేశారు. 

అంతకుముందు అచ్చెన్నాయుడిని విజయవాడ గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చారు. మరికాసేపట్లో ఆయనను జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీకి తెలియకుండా అచ్చెన్నాయుడు కొన్ని ప్రక్రియలు చేశారని, రూ.150 కోట్ల వరకు అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించింది.

Also Read:అచ్చెన్నాయుడు కుటుంబానికి ఫోన్... చంద్రబాబు, లోకేష్ హామీ

రూ.988 కోట్ల రూపాయల కొనుగోళ్లలో అచ్చెన్నాయుడు పాత్ర వుందని అధికారులు నిర్ధారించారు. మందులు, ల్యాబ్ పరికరాల కొనుగోలు టెండరింగ్‌లో మాజీ మంత్రి కుమారుడి పాత్ర వుందని తెలుస్తోంది.

ఈ కేసులో అచ్చెన్నాయుడి కుటుంబసభ్యులను సైతం ఏసీబీ ప్రశ్నించే అవకాశం వుంది. రమ్మంటే ఏసీబీ కార్యాలయానికి వచ్చానని.. ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది పడలేదని అచ్చెన్నాయుడు ఏసీబీ కార్యాలయంలోకి వెళ్లేముందు అన్నారు. ఏం జరుగుతుందో చూద్దామని ఆయన వ్యాఖ్యానించారు.