అమరావతి: మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నాయకులు కింజరాపు అచ్చెన్నాయుడిని గురువారం ఉదయం ఏసిబి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న ఆయన కుటుంబసభ్యులతో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ లు ఫోన్ లో మాట్లాడి ధైర్యంగా వుండాలని సూచించారు.  అచ్చెన్నాయుడు భార్య మాధవితో మాట్లాడిన చంద్రబాబు ఆందోళనకు గురికావద్దని సూచించారు. ఇలాంటి సమయాల్లోనే దైర్యంగా వుండాలని... కుటుంబానికి అండగా వుంటామని హామీ ఇచ్చారు. 

అచ్చెన్నాయుడు కుటుంబ సభ్యుల నుండి అరెస్ట్ సమయంలో చోటుచేసుకున్న పరిణామాల గురించి కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు. ఏసిబి అధికారులు  కనీస సమాచారం ఇవ్వకుండా బలవంతంగా కిడ్నాప్ తరహాలో తీసుకెళ్లారని... కనీసం కుటుంబ సభ్యులకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చంద్రబాబు మండిపడ్డారు. 

కక్ష సాధింపులో భాగంగానే అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారని... ఆధారాలు లేకుండా అక్రమ అరెస్ట్ చేశారనే విషయం అధికారుల ప్రెస్ మీట్ ద్వారా బయటపడిందని చంద్రబాబు అన్నారు. ప్రెస్ మీట్ లో అధికారుల టెన్షన్, మాటల్లో తడబాటే అందుకు నిదర్శనమన్నారు. వారిపై సీఎం జగన్ ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో వారి ముఖ భావాలే చెప్పాయని చంద్రబాబు తెలిపారు. 

read more  ఏపి, తెలంగాణాల్లో ఈఎస్ఐ స్కాం...రెండుచోట్ల బాధ్యులు వారే: అయ్యన్నపాత్రుడు

''అచ్చెన్నాయుడు అరెస్ట్ తో మరోసారి జగన్ రాజ్యాంగాన్ని ఖూనీ చేసారు. చట్ట నిబంధనలను తుంగలో తొక్కారు. దేశం అంతా ఒక రాజ్యంగం అమల్లో ఉంటే, మన రాష్ట్రంలో జగన్ సొంత రాజ్యాంగం అమలు. పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''అచ్చెన్న కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో పాటు రాష్ట్రం  మొత్తం అండగా ఉంటుంది. బీసి సంఘాలన్నీ అండగా ఉంటాయి. అచ్చెన్న అరెస్ట్ రాజ్యాంగంపై, పౌరుల ప్రాథమిక హక్కులపై జగన్ చేసిన దాడి. బిసిలను అణిచివేసే వైసిపి కుట్రలో భాగమే ఈ అరెస్ట్ '' అని చంద్రబాబు, లోకేష్ లు పేర్కొన్నారు.