Asianet News TeluguAsianet News Telugu

దేవాలయం ఆస్తులపై కన్నుతోనే సంచయిత నియామకం: జగన్ పై అనిత ఫైర్

అర్థరాత్రి ఇచ్చిన చీకటి జీవోతో చీకట్లో మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా నియమితులైన సంచయితకు చంద్రబాబు, లోకేశ్ వంటి నేతలపై ఆరోపణలు చేసే స్థాయిలేదని టీడీపీ మహిళ విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత చెప్పారు.

TDP leader anitha fires on Ap cm ys jagan
Author
Amaravathi, First Published Aug 18, 2020, 5:53 PM IST

అమరావతి: అర్థరాత్రి ఇచ్చిన చీకటి జీవోతో చీకట్లో మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ గా నియమితులైన సంచయితకు చంద్రబాబు, లోకేశ్ వంటి నేతలపై ఆరోపణలు చేసే స్థాయిలేదని టీడీపీ మహిళ విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత చెప్పారు.

మంగళవారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె నియామకం సక్రమమే అయితే అందుకు సంబంధించిన జీవోని ఎందుకు బయటపెట్టడం లేదని ఆమె ప్రశ్నించారు.

సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఎంతో విశిష్టమైన దని అటువంటి దేవస్థానంభూములను ఆ దేవుడే రక్షించుకోవా ల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. మాన్సాస్ ట్రస్ట్ బైలాస్ ప్రకారం గజపతుల వంశీకుల్లో పెద్దవాడైన పురుషవారసుడే ట్రస్ట్  కు ఛైర్మన్ గా ఉండాలని ఆమె గుర్తు చేశారు. 

ఈ నిబంధన ప్రకారమే తొలుత పీ.వీ.జీ రాజు తరువాత ఆనందగజపతి రాజు, అనంతరం అశోక్ గజపతి రాజులు చైర్మన్లుగా కొనసాగారన్నారు. ఆ నిబంధన ప్రకారమే సింహాచలం దేవస్థానానికి అనువంశిక ధర్మకర్తగా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతి రాజు 2020 మార్చి 4 వరకు కొనసాగినట్టుగా చెప్పారు.

దేవస్థానం భూములు, మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులపై కన్నేసిన జగన్, విజయసాయిరెడ్డి వాటిని కాజేయాలన్న దురుద్దేశంతో  బీజేపీనేత సంచయితను అర్థరాత్రి తీసుకొచ్చి ట్రస్ట్ చైర్మన్ గా నియమించారని ఆమె ఆరోపించారు.

ట్రస్ట్ నిబంధనల ప్రకారం చైర్మన్లను నియమించే అధికారం ప్రభుత్వానికి ఉండదని కానీ నియమనిబంధనలు, చట్టాల గురించి పట్టించుకోని జగన్ తనపుర్రెలో పుట్టిన నిర్ణయాలనే అమలు చేస్తుంటారన్నారు. 

అలా పుట్టిన ఆలోచన ప్రకారమే రూ.లక్ష కోట్ల విలువైన 14,800 ఎకరాలకు పైగా భూములను నొక్కేయడానికి జగన్  కుట్రలు పన్నాడని అనిత తెలిపారు. దేవస్థానం పరిధిలోఉన్న 11,000 ఎకరాలు కాకుండా మిగిలిన భూమి అన్యాక్రాంతమైందన్నారు. 

 ఆనందగజపతి రాజు మొదటి భార్య అయిన ఉమ ఎప్పుడో విడాకులు తీసుకుందని ఆమె గుర్తు చేశారు. ఆమెకు, ఆమెకుమార్తె సంచయితకు, ఆ కుటుంబంతో సంబంధం లేదన్నారు.

జగన్ ప్రభుత్వం కావాలనే ఆమెను చైర్మన్ గా నియమించిందన్నారు. సంచయిత నిమాయకం సక్రమమే అయితే ఆమె నియామకానికి సంబంధించిన జీవోని ఎందుకు వెబ్ సైట్లో పెట్టలేదని అనిత ప్రశ్నించారు.

 అదేవిధంగా సంచయిత తన ఆధార్ కార్డు, పాస్ పోర్టు లను కూడా ప్రజల ముందు పెట్టాలన్నారు. ట్రస్ట్ కు సంబంధించి ఇప్పటివరకు ఒక్క మీటింగ్ కూడా నిర్వహించలేదని ఆమె చెప్పారు. అటువంటి సంచయిత చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలు చేయడం ఏమిటని అనిత నిలదీశారు.

తన బాధ్యతలేమిటో సంచయిత తెలుసుకుంటే మంచిదన్నారు. మాన్సాస్ ట్రస్ట్ పై ఆధారపడి జీవించే వారికి ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలన్నారు. ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న సంచయితకు రోడ్డున పడ్డ, ట్రస్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగులు కనిపించడం లేదా అని అనిత నిలదీశారు. 

చంద్రబాబు ప్రభుత్వం దేవస్థానం గోశాలకు 128ఎకరాలు కేటాయిస్తే వాటిపై వైసీపీకి చెందిన పెద్దడేగ కన్నుపడిందన్నారు. గోశాలకు చెందిన భూమిని కాజేయాలన్న దురాలోచనతో అక్కడ ఆవులేమీ లేవని, ఉన్నవి చనిపోయాయని దుష్ప్రచారం చేశారన్నారు.

 ట్రస్ట్ చైర్ పర్సన్ సంచయిత ఎవరి బినామీనో, ట్రస్ట్ ఆస్తులను, భూములను ఎవరికి కట్టబెట్టడానికి ఆమె పనిచేస్తుందో చెప్పాలన్నారు. తన ఇంటి నేమ్ ప్లేటుపై తండ్రి పేరు రాయించుకోవడాన్ని నామోషీగా భావించిన సంచయిత ఆయనపూర్వీకులు స్థాపించిన ట్రస్ట్ కు ఛైర్ పర్సన్ గా ఎలా ఉంటుందని టీడీపీ మహిళా నేత ప్రశ్నించారు. 

సంచయిత ట్రస్ట్ ఛైర్ పర్సన్ గా కొనసాగడం వెనుక ఉన్న కుట్రకోణం గురించి అందరికీ తెలుసునన్నారు. చంద్రబాబునాయుడు, లోకేశ్ లపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అనిత మండిపడ్డారు. సింహాచలం దేవస్థాన సంప్రదాయాలను, ప్రతిష్టను కాపాడేలా సంచయిత ప్రవర్తించాలని ఆమెను చేతులెత్తి వేడుకుంటున్నా నన్నారు. మహిళలఆస్తిహక్కు గురించి మాట్లాడేముందు ఆస్తిహక్కుకి, వంశపారంపర్యంగా వచ్చే పదవులకు మధ్య ఉన్న వ్యత్యాసం గురించి సంచయిత తెలుసుకుంటే మంచిదన్నారు. 

హోంమంత్రి సుచరితకు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం కూడా రాదనే విషయం నిన్ననే తేలిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్రంలో లేదని చెప్పేబదులు, దానిపై సీబీఐ, ఇతర కేంద్రసంస్థలతో దర్యాప్తు జరపమని ఆమె ఎందుకు కోరడం లేదన్నారు..

 జగన్ ప్రభుత్వంలోని నాయకులకు చంద్రబాబు, లోకేశ్ ల గురించి మాట్లాడటం ఫ్యాషనైపోయిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడకుండా వ్యక్తులపై ఆరోపణలు చేయడం ఏమిటని అనిత నిలదీశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios