అమరావతి: మువ్వెన్నెల జాతీయ జెండా గౌరవాన్ని కాపాడే అర్హత మీకుందా? అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు టిడిపి నాయకులు ఆలపాటి రాజేంద్రప్రసాద్. జాతీయ పతాకావిష్కరణ జరిగి వందేళ్లు పూర్తయిన సందర్భంగా జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య కుటుంబాన్ని సన్మానించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఇందుకోసం శుక్రవారం సీఎం మాచర్లలో పర్యటన చేపట్టారు. ఈ నేపథ్యంలోనే జగన్ కు  ఆలపాటి బహిరంగ లేఖ రాసారు. 

''జాతీయ జెండాకు 100 ఏళ్లు పూరైన సందర్బంగా జెండా ఆవిష్కర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతారావమ్మను సన్మానించడం సంతోషకరం. రెపరెపలాడే జెండా అంటే యావత్ దేశ సంస్కృతికి  నిదర్శనం... సమానత్వం, సౌబ్రాతృత్వం, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. కాని మీ 22 నెలల పాలనలో ఎక్కడా ఈ అంశాలను స్పృశించిన పాపాన పోలేదు. ప్రతి సంఘటనలోను, ప్రతి క్షణంలోను ప్రజాస్వామ్యాన్ని మంటగల్పిన నాయకత్వం మీ పాలనలో సుస్పష్టంగా కనపడింది. ఇలాంటి తరుణంలో మీ డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ గౌరవ పురష్కారమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది'' అని లేఖలో పేర్కొన్నారు. 

''రాజారెడ్డి రాజ్యాంగానికి అనుగుణంగా నడపాలన్న కాంక్ష, ఆర్తితో కూడుకున్న మీ నైజం ప్రస్పుటంగా కనిపించే ప్రాంతం మాచర్ల ప్రాంతం. అక్కడ అన్యాయాలు, అక్రమాలు, గ్రామ బహిష్కరణలు, దళితుల ఊచకోతలు, మైనార్టీలపై దాడులు, ఎన్నికల్లో బెదిరింపులు, అక్రమ అరెస్టులు, హత్యలు, హత్యా ప్రయత్నాలు సర్వసాదారణం. రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగే ప్రాంతంగా భావించడానికి నూటికి నూరు శాతం మీ పాలనా వైఖరికి నిదర్శనం. కాబట్టి అక్కడి పెద్దలను సన్మానించుకునే ముందు చేసిన తప్పులు ఒప్పుకోవాలి. అందుకే వారిని గౌరవించే ముందు మాచర్ల ప్రజలకు మీరు చేసిన అన్యాయం మీద సమాధానం చెబితే అది రాష్ట్రానికి, జాతికి గౌరవం'' అని ఆలపాటి తన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.