చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా వుండగా వ్యవసాయం పండగలా వుంటే వైఎస్ జగన్ పాలనలో దండగలా మారిందని మాజీ మంత్రి  ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు.  

అమరావతి: టీడీపీ హయాంలో పాలన పండగలా ఉంటే నేడు దండగలా మారిందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ (alapati rajendraprasad)ఎద్దేవా చేశారు. కొండ నాలుకకు మందు వేస్తానని ఉన్న నాలుకను ఊడగొట్టినట్లుగా జగన్మోహన్ రెడ్డి (ys jagan) పాలనలో వ్యవసాయరంగం పరిస్థితి తయారయ్యిందని మండిపడ్డారు. 

''వైసిపి (ysrcp) ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేదొకటి. క్షేత్ర స్థాయిలో రైతుల పరిస్థితి చెప్పుకోవడానికి వీలు లేనట్లుగా ఉంది. వ్యవసాయ మంత్రిగానీ, మంత్రివర్గంగానీ, ముఖ్యమంత్రిగానీ మూడేళ్ల కాలంలో వ్యవసాయంపై, రైతు కష్టాలపై సమీక్ష జరిపిన దాఖలాలు లేవు. సమీక్షలు జరిపే ధైర్యమూ లేదు. ఏమీ చేయకున్నా వ్యవసాయం బాగుందని ప్రచారాలు మాత్రం చేస్తున్నారు'' అని మాజీ మంత్రి మండిపడ్డారు. 

''వైసిపి అధికారంలోకి వచ్చిన ఈ మూడు సంవత్సరాల్లో 2వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గత ప్రభుత్వం యాంత్రీకరణ ద్వారా ట్రాక్టర్లు, రొటావేటర్లు, స్ప్రేయర్లు, టార్పన్లు ఇచ్చింది. ఈ ప్రభుత్వం అవేమీ ఇవ్వలేదు. అంతేకాదు పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పి మోసం చేశారు. వడ్డీలేని రుణాలివ్వలేదు. గత ప్రభుత్వంలో 592 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలకు కేటాయిస్తే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు వడ్డీ లేని రుణాల కింద ఎంత కేటాయించారో చెప్పలేకపోతోంది'' అన్నారు. 

''ప్రకృతి వైపరిత్యాల వల్ల ఒకపక్క పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ అసమర్థపు ఆలోచనల వల్ల, అరకొర విధానాల వల్ల కూడా రైతుకు నష్టం కలుగుతోంది. రైతులు పండిన పంట ఆఖరి గింజ కూడా కొంటానన్న ప్రభుత్వం మొండిచేయి చూపింది. పసుపు, జొన్న, మొక్కజొన్న, మిర్చీ, పత్తి పంటలు నష్టపోతే ఆదుకున్న దాఖలాలు లేవు. దెబ్బతిన్న పంట అరకొరగా కొనడం జరిగింది. కల్లాలలో, పొలాల వద్ద పంటను కొంటామని చెప్పి మాట మార్చారు'' ఆలపాటి ఆందోళన వ్యక్తం చేసారు. 

''బ్రహ్మాండంగా ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. సబ్సిడీ కింద 80శాతం విత్తనాలు ఇచ్చామని కూడా ప్రచారం చేసుకుంటున్నారు. అదును, పదును చూసి విత్తనాల పంపిణీ ఏనాడు జరగలేదు. 268 రూపాయలకు దొరికే యూరియాకు 300 రూపాయల నుంచి 400 రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఎరువుల కొరత లేని గ్రామమే లేదు'' అన్నారు.

''తుఫాను సందర్భంగా, అకాల వర్షాల సమయంలో రైతుల ప్రభుత్వ సహాయం శూన్యం. పింఛా, అన్నమయ్య ప్రాజెక్టులు తెగిపోతే దానికి కారణాలు ఇంతవరకు తెలుసుకోలేదు. ప్రభుత్వం యంత్రాంగానికి ముందుచూపులేక అనేక వేల ఎకరాల పంట మేటకు గురైంది. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల పంపిణీ సక్రమంగా లేదు. ప్రభుత్వం పంటలు కొనుగోలు చేస్తే రైతులకు డబ్బులు ఇవ్వడం లేదు. 50 వేల ఎకరాల్లో రూ.24 కోట్ల పంట నష్టం జరిగితే కేవలం పది శాతానికే పరిమితం చేశారు. కానీ రూ.632 కోట్లిచ్చానని గొప్పగా చెప్పుకుంటున్నారు. గత టీడీపీ హయాంలో 3,759 కోట్ల రూపాయలు పంట నష్ట పరిహారం అందించింది'' అని ఆలపాటి గుర్తుచేసారు. 

''రైతు ఇన్సూరెన్స్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడితే అదే రాత్రి డబ్బులు చెల్లించింది. కానీ ఈ క్రాప్ ను ఆధారంగా చేసుకొని 60 శాతం రైతులకే న్యాయం చేస్తామనడం అన్యాయం. మిగతా 40 శాతం పంట వేయనీయరా? పంట నష్టాన్ని అంచనా వేయడంలో అన్యాయంగా వ్యవహరించారు. రైతులకు సంవత్సరానికి రూ.50 వేలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి ఏడున్నర వేలు మాత్రమే ఇస్తున్నారు. రైతు వెన్నెముకను విరగ్గొట్టి వ్యవసాయ రంగాన్ని కుదేలు చేశారు. రైతుకు ఏ అంశంలో న్యాయం జరిగిందో చెప్పాలి'' అని నిలదీసారు.

''రైతులను ఆదుకోవాల్సింది పోయి మిల్లర్లను దళారులను ఆదుకుంటున్నారు. వ్యవసాయం బాగుందని ప్రచారాలు మాత్రం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో తాము 16వేల రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం, నేడు వాటిని గుజరాత్ అమూల్ పాల సంస్థకి తాకట్టు పెట్టారా? అవి ఏమయ్యాయో చెప్పాలి. పాల సేకరణ కేంద్రాలకు సహాయం లేదు. పాల ఉత్పత్తిదారులకు అన్యాయం జరుగుతోంది. కాడి, మేడి, కర్ర అంటే తెలిసినవాడే రైతు.. జగన్ కు అవేమీ తెలియవు'' అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మండిపడ్డారు.