విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో వలసలు జనసేన, టీడీపీల నుంచే అధికంగా ఉంటాయని స్పష్టం చేశారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ.  ఇకపై నిత్యం బీజేపీలోకి వలసలు జరుగుతూనే ఉంటాయన్నారు. బీజేపీలో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోందని చెప్పుకొచ్చారు. 

విజయవాడలో మీడియాతో మాట్లాడిన కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ నుంచి వలసలు ఉంటాయా అన్న ప్రశ్నపై దాటవేత ధోరణి ప్రదర్శించారు. జనసేన, టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి చేరికలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. తమతో టచ్ లో ఉంది ఆ పార్టీ నాయకులేనని చెప్పుకొచ్చారు.  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే ఏకైక నాయకుడు ప్రధాని నరేంద్రమోదీ అని చెప్పుకొచ్చారు. ఆ విషయాన్ని గ్రహించే అంతా బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారని తెలిపారు. భవిష్యత్ లో మైనారిటీ, బీసీ, దళిత వర్గాల నుంచి వలసలు ఉంటాయని తెలిపారు. 

ఇకపోతే జనసేన నుంచి కూడా కీలక నేతలు బీజేపీలోకి వస్తారని తెలిపారు. ఇప్పటికే మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు పార్టీలో చేరిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు వ్యవహారశైలిపై ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. 

చంద్రబాబు నాయుడుపై విసుగుతోనే టీడీపీ నేతలు బీజేపీలోోకి క్యూ కడుతున్నారన్నారు. ఫిరాయింపులకు పాల్పడ్డ చంద్రబాబు ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ.