CBN: కూటమి కుదిరినట్టే! వైసీపీపై దాడికి డేట్ కూడా ఫిక్స్
ఈ రోజు టీడీపీ, బీజేపీ ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. టీడీపీని ఎన్డీయేలోకి ఆహ్వానించినట్టు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ నెల 28వ తేదీన ఉమ్మడిగా బహిరంగ సభ నిర్వహించనున్నారు.
Pawan Kalyan: ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష శిబిరంలో ఒక ముఖ్య ఘట్టం జరిగింది. విజయవాడలో టీడీపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో రెండు తీర్మానాలను ఆమోదించారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తును స్వాగతిస్తున్న క్యాడర్‌ను అభినందిస్తూ ఒక తీర్మానం.. మీడియాపై దాడులను తప్పుబడుతో మరో తీర్మానాన్ని ఆమోదించారు. ఈ భేటీ అనంతరం, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు.
టీడీపీని ఎన్డీఏలోకి ఆహ్వానించారని, త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన ఉంటుందని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఉమ్మడి మ్యానిఫెస్టోను త్వరలోనే ప్రకటిస్తామని, సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయాలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేతిలో ఉంటాయని వివరించారు. కలిసి పని చేసే సమయం ఆసన్నమైందని, విపక్షాల ఓటు చీలకూడదనే ఏకైక లక్ష్యంతో ఈ పొత్తు పెట్టుకుంటున్నామని నాదెండ్ల తెలిపారు.
అంతేకాదు, ఉమ్మడిగా బహిరంగ సభను నిర్వహించబోతున్నట్టు వెల్లడించారు. తాడేపల్లిగూడెంలో ఈ నెల 28వ తేదీన బహిరంగ సభ నిర్వహిస్తామని, 500 మంది ప్రత్యేక అతిథులు, ఆరు లక్షల మంది సభకు వస్తారని అంచనా వేస్తున్నట్టు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Also Read : YS Sharmila: అరెస్టు చేస్తుండగా గాయపడ్డ వైఎస్ షర్మిల.. తన తండ్రి, తల్లిని పేర్కొంటూ కామెంట్స్
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య పొత్తు అనేది కొన్ని నెలలుగా నానుతున్నది. ఎన్నికల సమీపిస్తున్నా ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో టీడీపీ, జనసేన క్యాడర్‌లో నిరాశ ఉన్నది. ఇవాళ్టి మీటింగ్‌తో కూటమి కోరుకునేవారిలో ఉత్సాహం వచ్చింది. అదీగాక, చాన్నాళ్ల తర్వాత కూటమి కుదిరాక తొలిసారి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఒకే వేదికపై కనిపించనుండటం కొత్త ఉత్తేజాన్ని వారికి ఇస్తున్నది. ఈ బహిరంగ సభలోనే వైసీపీపై దాడి చేసే వ్యూహం వెల్లడి కానుంది. ఉభయ పార్టీల ఉమ్మడి నెరేటివ్ బయటకు రానుంది. ఈ బహిరంగ సభపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొని ఉన్నది.