అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్నాయి..రాజకీయ పార్టీలు సమరానికి సమాయత్తమవుతున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో వ్యూహంతో దూసుకుపోతుంది. ఎన్నికలు అంటే ఒకప్పుడు పార్టీతోపాటు ధన బలం ఉంటే చాలు అనుకునే వారు...కానీ నేడు ఆ పరిస్థితిలు మారిపోయాయి. సామాజిక వర్గాల వారీగా పార్టీలు విడిపోయాయి.  

ఏపీలో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా మారిపోయాయి. రాజకీయ పార్టీలు కుల పార్టీలుగా మారిపోయి రాజకీయాలను శాసించేస్థాయికి చేరుకున్నాయి. దీంతో ఒక్కోపార్టీ ఒక్కో కుల పార్టీగా చెప్పుకునే స్థితికి చేరాయి.  కాంగ్రెస్ పార్టీ ఒక సామాజికవర్గానికి కొమ్ముకాస్తుందని....తెలుగుదేశం పార్టీ మరోవర్గానికి కొమ్ముకాస్తుందని.....జనసేన పార్టీ వేరే వర్గానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకో వర్గానికి కొమ్ముకాస్తుందంటూ ఏ పార్టీకి ఆపార్టీ ప్రచారం చేసేసుకుంటున్నాయి. అలాగే లెక్కలు కూడా వేసుకుంటున్నాయి. 

ఒకప్పుడు దళిత, బీసీ, మైనార్టీ ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయ పార్టీలు వేసే ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. కానీ నేడు రాజకీయాల తీరు మారిపోయాయి. దళిత,బీసీ, మైనార్టీ వర్గాలను సైతం రాజకీయ పార్టీలు పంచేసికున్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఒక్కో పార్టీ ఒక్కో సామాజికవర్గంగా విడిపోవడంతో ఇతర సామాజిక వర్గాలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా ఏపీలో అయితే ఈ కుల రాజకీయాలు తీవ్ర ప్రభావాన్నిచూపుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 

2014 ఎన్నికల్లో కొన్ని సామాజిక వర్గాలు టీడీపీని అధికారంలోకి తెచ్చాయనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అటు పార్టీల పరంగా చూస్తే తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు టీడీపీకి కొమ్ముకాశాయి. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మంచి ఊపుమీద ఉంది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తుందని ఆ పార్టీ ధీమా కూడా వ్యక్తం చేసింది. అయితే ఊహించని రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ అధికారంలోకి రావడంతో వైసీపీ ప్రతిపక్షంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

అయితే వైసీపీ అధికారం కోల్పోవడానికి...టీడీపీ అధికారంలోకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గమైన  కాపు సామాజికవర్గం గంపగుత్తగా టీడీపీకి ఓటేశారని అందువల్లే గెలిచిందని టాక్. అది నిజం అని కూడా రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం రాజకీయాలు మారిపోయాయి. ఒకప్పుడు మద్దతుగా నిలచిని పవన్ కళ్యాన్ ఇప్పుడు ఒంటరిగా వెళ్లాలనుకుంటున్నారు. దీంతో టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

వచ్చే ఎన్నికల్లో పవన్ విభేధిస్తే కాపు సామాజిక వర్గం ఓట్లు టీడీపీకి దూరం కానున్నాయనే వార్తలు ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ కాపులను అక్కున చేర్చుకునేందుకు కాపు కొర్పొరేషన్ వేసింది. వెయ్యి కోట్లు రుణాలు కూడా ఇచ్చింది. అంతే కాదు కాపులను బీసీల్లో చేరుస్తామంటూ మంజునాథ కమిషన్ ను వేసివాళ్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు కూడా చేస్తోంది. 

అయితే పవన్ కళ్యాణ్ ప్రజాపోరాట యాత్ర పేరుతో జిల్లాలను చుట్టేస్తుండటం, టీడీపీపై నిప్పులు చెరుగుతుండటంతో కాపు సామాజిక వర్గం తమకు ఎక్కడ దూరం అవుతుందోనని ఆందోళన చెందుతుందట. వాస్తవానికి రాష్ట్రంలో కాపు జనాభా 40 లక్షలు. అంటే రాష్ట్ర జనాభాలో 18 శాతం. కాపు రిజర్వేషన్లపై కాపు నేత ముద్రగడ పద్మనాభం పోరాటం చేస్తుండటం...ముఖ్యమంత్రి కాపు ద్రోహి అన్నట్లుగా పదేపదే లేఖలు రాయడం చూస్తుంటే టీడీపీకి కాపులు దూరమవుతారా అన్నమీమాంసలో పడిందట. 

ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాల్లో గెలుపు ఓటములను ప్రభావితం చెయ్యగల సామర్ధ్యం కాపు సామాజిక వర్గానిదే కావడంతో టీడీపీ తలలు పట్టుకుంటుందట. తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపుం నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన కాపు సామాజికవర్గానికి చెందిన నిమ్మకాయల చినరాజప్పకు డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టడం..కీలకమైన హోంశాఖ ఇవ్వడంతో కాపులు కాస్త స్తబ్ధుగా ఉన్నారని అదే పదవీకాలం అయిపోతే జనసేనకు జై కొడితే పరిస్థితి ఏంటని అంతర్మథనం చెందుతున్నారట. 

అందుకే ఏ పార్టీ ఇవ్వలేనన్ని హమీలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు. 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారికి కాపు కార్పొరేషన్‌ ద్వారా రుణాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే సీఎం చంద్రబాబు 21 నుంచి 50 ఏళ్లకు పెంచేశారు. అంతేకాదు అర్హత కలిగిన కాపు విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇస్తామని ప్రకటించేశారు. 

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులకు 10లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం ఇస్తామన్నారు. అంతేకాకుండా కాపులను వ్యాపార వేత్తలుగా మార్చేందుకు ప్రతి నియోజకవర్గంలో 15 నుంచి 20 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ ఎస్టేట్‌ ఏర్పాటుచేసి చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పేలా ప్లాన్ చేస్తామని ప్రకటించారు. 26 కోట్లతో ప్రతీ జిల్లాకు ఒక కాపు కమ్యూనిటీ భవనం నిర్మించేందుకు నిధులు కూడా కేటాయించేశారు.  స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పుకొనే కాపులకు రాయితీలు కూడా ఇస్తామని ప్రకటించారు. 

రెండు లక్షల రూపాయలతో ఒక యూనిట్ పెడితే లక్ష రూపాయలు రాయితీ ఇస్తామని 5మంది కలిసి గ్రూపుగా ఏర్పడి 25లక్షలతో యూనిట్ పెట్టుకుంటే 10లక్షలు రాయితీ ఇస్తామని ప్రకటించారు. ఇన్ని వరాలు ప్రకటించినా టీడీపీకి ధైర్యం సరిపోవడం లేదట. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్లు విమర్శిస్తుంటే కనీసం ఒక్క కాపు నేత కూడా స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. 

అప్పుడప్పుడు డిప్యూటీ సీఎం చినరాజప్ప అక్కడక్కడ ఖండిస్తున్నా మిగిలిన వారు స్పందించడం లేదు. మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా తప్పదు అన్నట్లుగా ఏదో అనేసి ఊరుకుంటున్నారు. ఇకపోతే ప్రతిపక్ష పార్టీపై ఒంటి కాలితో లేచే బొండా ఉమ, తోట త్రిమూర్తులు...జ్యోతుల నెహ్రూ వంటి నేతలు ఉన్నాస్పందించకపోవడం చంద్రబాబుకు విస్మయానికి గురిచేస్తోందట. 

ఈనెలాఖరున తూర్పుగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్న నేపథ్యంలో కాపు నాయకులతో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 

ఈ వార్తలు కూడా చదవండి

టీడీపీ పక్కా ప్లాన్: విజయానికి అసలు ప్రయోగశాల ఇదే..

వాళ్లిద్దరూ ఒకటయ్యారు: వైసీపీకి దెబ్బేనా?