గల్లా జయదేవ్‌కు టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే వుంటాయ్ : నారా లోకేష్ వ్యాఖ్యలు
తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సంచలన ప్రకటన చేశారు. దీనిపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఆయన కోసం టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే వుంటాయని లోకేష్ స్పష్టం చేశారు.
తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ టీడీపీ నేత, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ సంచలన ప్రకటన చేశారు. దీనిపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. రాజకీయాలకు విరామం ప్రకటిస్తూ జయదేవ్ ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ.. అమరావతి రైతుల తరపున జయదేవ్ పోరాటం చేశారని కొనియాడారు. ఆయన కోసం టీడీపీ తలుపులు ఎప్పుడూ తెరిచే వుంటాయని లోకేష్ స్పష్టం చేశారు. తాము అధికారంలో వున్నప్పుడు ఏనాడూ కంపెనీల జోలికి వెళ్లలేదని, గుంటూరు లాంటి టికెట్‌ను ఏ నేత వదులుకోరని కానీ జయదేవ్ వదులుకున్నారని పేర్కొన్నారు.
అంతకుముందు జయదేవ్ మాట్లాడుతూ.. శాశ్వతంగా తాను రాజకీయాలకు దూరంగా వుంటానని చెప్పడం లేదని, కానీ కొంతకాలం వ్యాపారాలపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బిజెనెస్ పనుల్లో బిజీబిజీగా వుంటూ ప్రజలకు పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించలేకపోతున్నా... అందువల్లే ఈసారి ఎంపీగా పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నానని జయదేవ్ తెలిపారు. అంతేకాదు తాను బిజినెస్ చేస్తూనే ఎంపీగా వుండటం వివాదాస్పదం అవుతోంది... ఇది కూడా పోటీకి దూరంగా వుండటానికి ఓ కారణమని అన్నారు. ఇకపై తన పూర్తిసమయం బిజినెస్ కే కేటాయించాలని అనుకుంటున్నాను... అందుకోసమే రాజకీయాలకు దూరం అవుతున్నట్లు గల్లా జయదేవ్ ప్రకటించారు.
2024 ఎన్నికల్లో పోటీ చేస్తే తప్పకుండా ప్రజలు ఆదరిస్తారని తెలుసు... గెలుస్తాననే పూర్తి నమ్మకం ఉందని గల్లా జయదేవ్ అన్నారు. కానీ వ్యాపార కార్యకలాపాలు చూసుకునేందుకే ఫోటీ చేయొద్దని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తర్వాత మళ్ళీ అవకాశం వస్తే తప్పకుండా గుంటూరు లోక్ సభ నుండే పోటీ చేస్తానని గల్లా జయదేవ్ తెలిపారు. రెండుసార్లు ఎంపీగా పని చేసానని ... ఈ పదేళ్ల తన పనితీరు ఎంతో సంతృప్తికరంగా వుందని గల్లా జయదేవ్ అన్నారు.
చాలామంది ఎంపీలకు వారు చెయాల్సిన పనులేంటో కూడా తెలియవు... కానీ తాను ఎంపీగా చేయాల్సిన అన్ని పనులూ చేశానన్నారు. రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి అండగా వుండాలంటే ఎంపిగా పోటీ చేయడమే సరైనదని భావించానని... అందుకోసమే ఏరికోరి టిడిపి నుండి గుంటూరు లోక్ సభకు పోటీచేసానని అన్నారు. గుంటూరులో పని చేయడం చాలా ఆనందంగా ఉందని గల్లా జయదేవ్ అన్నారు.
ఎంపీగా పోటీచేసిన రెండుసార్లు డిల్లీతో పోరాటం చేస్తానని చెప్పాను... దీంతో ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించాలని జయదేవ్ తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర సమస్యల పరిష్కారానికి కృషి చేసానని... కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసానని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధానిగా అమరావతి కొనసాగింపుపై కేంద్రంతో పోరాటం చేసానని అన్నారు. తన పనితీరు బాగుంది కాబట్టే గుంటూరు ప్రజలు రెండోసారి కూడా గెలిపించారని గల్లా జయదేవ్ పేర్కొన్నారు.
తన కుటుంబానికి రాజకీయంగా మంచి పేరుంది... దాన్ని చెడగొట్టకుండా విలువలతో కూడిన రాజకీయాలు చేసానని గల్లా జయదేవ్ అన్నారు. తన తల్లి గల్లా అరుణ కుమారి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని... ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేసారని అన్నారు. అప్పటినుండే సొంత వ్యాపారాలు చూసుకుంటూ రాజకీయాలు చేసేవారిమని... ఇప్పుడలా కుదరడం లేదన్నారు. అందువల్లే కొంతకాలం రాజకీయాలకు దూరంగా వుంటూ వ్యాపారాలు చూసుకోవాలని నిర్ణయించుకున్నట్లు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు.