అనంతపురం: మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబసభ్యులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం నాడు పరామర్శించారు.

నకిలీ పత్రాలతో వాహనాలను విక్రయించారనే కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డితో ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలను ఈ నెల 13వ తేదీన పోలీసులు అరెస్ట్ చేశారు. అదే రోజున కడప జైలుకు తరలించారు.

కడప జైలులో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలను పరామర్శించేందుకు లోకేష్ ఈ నెల 14న కడపకు వెళ్లారు.  కరోనా కారణంగా కడప జైలులో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు అస్మిత్ రెడ్డిని కలిసేందుకు జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు.దీంతో ఇవాళ జేసీ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు రోడ్డు మార్గంలో లోకేష్ అనంతపురం పట్టనానికి చేరుకొన్నారు.

also read:జేసీ ప్రభాకర్‌రెడ్డితో ములాఖత్‌కు లోకేష్ జైలు అధికారులు నో

నకిలీ పత్రాలతో వాహనాలు విక్రయించారనే కేసు వివరాలను జేసీ పవన్ కుమార్ రెడ్డి నుండి లోకేష్ అడిగి తెలుసుకొన్నారు. జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై లోకేష్ జేసీ కుటుంబసభ్యులతో చర్చించారు. 

నకిలీ పత్రాలతో తమకు వాహనాలను విక్రయించారని నాగాలాండ్ డీజీపీకి తామే ఫిర్యాదు చేసినట్టుగా ఈ కేసు విషయమై జేసీ పవన్ కుమార్ రెడ్డి ఈ నెల 13వ తేదీన మీడియాకు వివరించారు. తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు.