అమరావతి: బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించారు తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ దివ్యవాణి. తాను తెలుగుదేశం పార్టీని వీడతానని వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. బీజేపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తుదిశ్వాస వరకూ తాను తెలుగుదేశం పార్టీని వీడేది లేదని చెప్పుకొచ్చారు. కష్ట కాలంలో పార్టీలో ఉన్నవారే నిజమైన నాయకులని దివ్యవాణి చెప్పుకొచ్చారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం తన వంతు కృషి చేస్తానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు దివ్యవాణి. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు దివ్యవాణి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పదవి ఇచ్చి సముచిత స్థానం కల్పించారు చంద్రబాబు నాయుడు. 

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన తర్వాత ఆనాటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ను ఆయన కుటుంబ సభ్యులను తీవ్రంగా విమర్శించారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజాను సైతం ఘాటుగా విమర్శించారు. 

దేశరాజధాని ఢిల్లీలో జరిగిన నవనిర్మాణ దీక్షలో ప్రధాని నరేంద్రమోదీని తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టిపోశారు దివ్యవాణి. తన పదునైన మాటలతో ప్రతిపక్షాలపై విరుచుకుపడుతూ అనతికాలంలోనే టీడీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు దివ్యవాణి. 

ఇకపోతే మరో తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ సాధినేని యామిని బీజేపీలో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. కన్నా లక్ష్మీనారాయణతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె బీజేపీలో చేరిపోవడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై యామిని రియాక్ట్ అవ్వకపోవడం విశేషం.