రోడ్డు ప్రమాదంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే కందుల నాారాయణ రెడ్డి తీవ్ర గాయాలపాలై హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నారు.
ప్రకాశం : తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మార్కాపురం నియోజకవర్గ టిడిపి ఇంచార్జీగా కొనసాగుతున్న ఆయన పార్టీ కార్యక్రమాలు ముగించుకుని హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలైన మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ కార్పోరేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు... ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేనట్లు సమాచారం.
మార్కాపురం నుండి హైదరాబాద్ కు బయలుదేరిన కందుల నారాయణరెడ్డి యర్రగొండపాలెం సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. గురిజేపల్లి మూలమలుపు వద్ద వేగంగా వెళుతున్న ఎమ్మెల్యే కారు ఒక్కసారిగా అదుపుతప్పి రోడ్డుపక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. దీంతో కారులోని మాజీ ఎమ్మెల్యే తీవ్రంగా గాయపడగా డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Read More ఏలూరు పాత బస్టాండ్‌లో ప్రమాదం.. కూలిన శ్లాబ్.. ఆరుగురు ప్రయాణికులకు గాయాలు..
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు మాజీ ఎమ్మెల్యే కందులకు కారులోంచి బయటకుతీసి యర్రగొండపాలెంకు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం కందులకు మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు హైదరాబాద్ కు తరలించారు. సమయానికి వైద్యం అందడంతో కందులకు ప్రాణాలకు ప్రమాదం తప్పింది.
ఈ రోడ్డు ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే కారు ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొంటున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్దారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
