విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, టిడిపి మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు కన్నుమూశారు. కొన్నేళ్లుగా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ ఇవాళ(గురువారం) ఆయన మృతిచెందారు. 

గతంలో పెడన నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఫోటీచేసి గెలిచిన వెంకట్రావు టిడిపి ప్రభుత్వ హయాంలో ఎన్నో కీలక పదవులు చేపట్టారు. ప్రభుత్వ చీఫ్ విప్ గా, రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్ గా, తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా పలు కీలక పదవులు నిర్వర్తించారు. అయితే వయసు మీదపడటం(71ఏళ్లు), ఆరోగ్య సమస్యలు తలెత్తడంలో వెంకట్రావు గతకొంతకాలంగా రాజకీయాలకు దూరంగా వుంటున్నారు.  

అయితే వెంకట్రావు కుమారుడు కృష్ణ ప్రసాద్ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాజకీయాల్లో వున్నారు. కుమార్తె మాత్రం వైద్య రంగంలో సేవలు అందిస్తున్నారు. సీనియర్ నాయకులు కాగిత మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, విద్యావేత్తలు సంతాపం తెలిపారు.

గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వెంకట్రావు గతంలో బైపాస్ సర్జరీ కూడా చేసుకున్నారు. అయినప్పటికి ఆరోగ్య పరిస్థితి విషమించి తాజాగా మరణించారు. ఇవాళ సాయంత్రమే వెంకట్రావు స్వగ్రామం నాగేశ్వరరావు పేట గ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి.  

read more  కరోనా మరణ మృదంగం...తాజాగా మరో మాజీ ఎమ్మెల్యే మృతి

టీటీడీ మాజీ ఛైర్మన్ వెంకట్రావు మృతిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. పార్టీ పటిష్టతకు కృతనిశ్చయంతో పని చేసిన వ్యక్తి వెంకట్రావని కొనియాడారు. పెడన నియోజకవర్గ ప్రజలకు ఎనలేని సేవలందించారని... ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో వుండే వ్యక్తి వెంకట్రావని.... పార్టీ మంచి నాయకున్ని కోల్పోయిందన్నారు. వెంకట్రావు కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.