అనంతపురం: వాహనాల కొనుగోలు కేసులో అరెస్టయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాను వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు పోలీసులకు చెప్పారు. హైదరాబాదులో అరెస్టు చేసి ఆయనను అనంతపురం తరలించారు. అనంతపురం పోలీసు స్టేషన్ లో ఆయనను మూడు గంటలపాటు విచారించారు. వాహనాల కొనుగోలు గురించి ఆ విచారణ జరిగింది. 

ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డిని ప్రబుత్వాస్పత్రికి తరలించారు. జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అరెస్టు చేసి అనంతపురం తీసుకుని వచ్చిన నేపథ్యంలో పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జేసీ అనుచరులు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నయ్య జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి పోలీసు స్టేషన్ కు వచ్చారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎఎస్ జగన్మోహన్ రెడ్డిపై జేసీ దివాకర్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సన్నిహితంగా ఉంటున్న ముఖ్య నాయకులను జగన్ లక్ష్యం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. చంద్రబాబును తాకితే భస్మమేనని దివాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు.  

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన కుమారుడిని కూడా అరెస్టు చేశారు. వారిద్దరిని అనంతపురం పోలీసులు శనివారంనాడు హైదరాబాదులో అరెస్టు చేశారు. 

154 బస్సులకు సంబంధించి నకిలీ ఎన్ఓసీలు సృష్టించిన కేసులో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇరువురిని పోలీసులు అనంతపురానికి తరలిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టును పోలీసులు ధృవీకరించారు. అనంతపురం మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి పనిచేశారు. 

బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వారిద్దరిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరపగా నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటి వరకు 154 వాహనాలను నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు తేలింది. వాటికి సంబంధించిన నకిలీ ఎన్ఓసీ, నకిలీ ఇన్సూరెన్స్ ల కేసుల్లో వారిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 

నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధింంచి జేసీ ట్రావెల్స్ మీద 24 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్ మీద 27 కేసులు నమోదయ్యాయి.

ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ మర్నాడే శనివారం ఉదయం జేసీ ప్రభాక్ర రెడ్డిని అరెస్టు చేశారు. ఈ రెండు అరెస్టులతో తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బ తగిలినట్లే.