విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను వెనకేసుకు వచ్చారు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు. రాష్ట్రంలో ఇసుక కొరతను నిరసిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వేదికగా చేపట్టిన లాంగ్ మార్చ్ విజయవంతమైందన్నారు. 

పవన్ కళ్యాణ్ లాంగ్ మార్చ్ ని చూసి వైసీపీ ప్రభుత్వం భయంతో వణికిపోయిందని మండిపడ్డారు. ఉచిత ఇసుక పాలసీని అమలు చేసేవరకు ఇసుక మీద పోరాటం చేస్తామని బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు.  

మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గురువారం చేపట్టబోయే ఇసుక దీక్షపై టీడీపీ నేతలు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బోండా ఉమామహేశ్వరరావు కృత్రిమ ఇసుక కొరత, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు.  

ఇసుక కొరత కారణంగా చనిపోయిన భవన నిర్మాణ కార్మికులకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు కరవుభృతి కింద నెలకు రూ.10వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 

వైసీపీ నేతలు ఒక మాఫియాగా ఏర్పడి ఇసుకను దోచేస్తున్నారని అలాంటి వారి పేర్లను టీడీపీ విడుదల చేసిందని తెలిపారు. టీడీపీ విడుదల చేసిన చార్జ్ షీట్‌లోని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఇసుక కొరత ఏర్పడిందని, వైసీపీ ప్రభుత్వం చెత్త విధానాలవల్లే ఈ పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. ఇసుక కొరతను నివారించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు. 

ఈ వార్తలు కూాడా చదవండి

దోస్త్ మేరా దోస్త్: చంద్రబాబు దీక్షకు పవన్ మద్దతు, దీక్షకు జనసైనికులు

పవన్ కళ్యాణ్ తో టీడీపీ నేతల భేటీ: బాబు దీక్షకు మద్దతుపై చర్చ