Asianet News TeluguAsianet News Telugu

మానవహక్కుల ఛైర్మన్, సభ్యుల ఎంపిక సమావేశం... బహిష్కరించిన టిడిపి

రాష్ట్రంలో ఏ వ్యక్తి హక్కులైకైనా రక్షణ ఉందా?... హక్కులకు గౌరవం లేని ఏకైక రాష్ట్రం ఏపీనే అని యనమల ఆరోపించారు. 
 

TDP Decides to Not Attend women rights Meeting... Yanamala Ramakrishnudu
Author
Amaravathi, First Published Mar 17, 2021, 12:35 PM IST

అమరావతి: మానవ హక్కుల ఛైర్మన్, సభ్యుల ఎంపిక సమావేశాన్ని టిడిపి బహిష్కరిస్తున్నట్లు శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ప్రకటించారు. రాష్ట్రంలో ఏ వ్యక్తి హక్కులైకైనా రక్షణ ఉందా? అని ప్రశ్నించారు.హక్కులకు గౌరవం లేని ఏకైక రాష్ట్రం ఏపీనే అని యనమల ఆరోపించారు. 

''రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా వ్యక్తుల స్వేచ్ఛ, గౌరవానికి భంగం కలిగినప్పుడు అతి తక్కువ ఖర్చుతో న్యాయం పొందే అవకాశం మానవ హక్కుల కమిషన్‌ కల్పిస్తుంది. కానీ నేటి ప్రభుత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వులు బేఖాతర్ చేస్తూ మానవ హక్కుల కమీషన్ ఏర్పాటు చేయకుండా కాలయాపన చేసింది'' అని అన్నారు. 

''వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్రంలో అరాచాకాలు, విద్యంసాలు, ప్రజా హక్కుల ఉల్లంఘన తీవ్రమైంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్పూర్తిని తుంగలో తొక్కుతూ.. దాడులు, దౌర్జన్యాలు, అకృత్యాలతో నెత్తుటి పాలన సాగిస్తున్నారు. ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను సైతం భంగపరుస్తున్నారు. రాష్ర్టంలోని ప్రజలు స్వేచ్చగా మసలుకునే అవకాశం లేకుండా పోయింది. తమ భావాలను బహిరంగంగా వ్యక్తం చేసే పరిస్థితి లేదు'' అని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. 

''ప్రభుత్వ తప్పుల్ని ఎత్తుచూపిన పత్రికారంగంపై, పాత్రికేయులపై దాడులకు పాల్పడ్డారు. అక్రమ కేసులు బనాయించారు. సదరు మీడియా ఆర్ధిక మూలాలను దెబ్బతీశారు. పత్రికా స్వేచ్చను హరించేందుకు ఏకంగా 2430 జీవో తీసుకొచ్చి మీడియా గొంతునొక్కారు. అమరావతి కోసం ఉద్యమం చేస్తున్న మహిళపై పోలీసులతో దాడులు చేయించి, అక్రమ కేసులు పెట్టారు. మాస్కు అడిగినందుకు నడిరోడ్డుపై ఓ వైద్యుడిపై దాడి చేసినపుడు, ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు దళిత యువకుడిని శిరోముండనం చేసినపుడు, మద్యం మాఫియాను ప్రశ్నించినందుకు వేధించి ఓ దళిత యువకుడు ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి వారి హక్కుల్ని హరించారు'' అని గుర్తుచేశారు. 

''స్ధానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు స్వేచ్చగా ఓటు వేసే హక్కు కూడా లేకుండా.. బెదిరింపులు దిగారు. భయపెట్టారు. ప్రత్యర్ధి పార్టీలకు చెందిన అభ్యర్ధులు పోటీలో లేకుండా చేశారు. ఎదురించి పోటీలో నిలబడిన వారిని కిడ్నాప్ చేయడం ద్వారా.. ప్రజాస్వామ్య బద్దంగా దక్కిన హక్కుల్ని కాలరాశారు. జగన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో బలహీనవర్గాల ప్రజల హక్కుల్ని హరించి వారిని ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా అణిచివేస్తోంది'' అని మండిపడ్డారు. 

''ఒకవైపు ప్రజాస్వామ్య స్పూర్తిని నీరుగారుస్తూ.. ప్రజా హక్కుల్ని హరిస్తూ.. నీరో చక్రవర్తిలా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏర్పాటు చేసిన సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా బహిస్కరిస్తున్నాం. మానవ హక్కులన్నా, రాజ్యాంగ హక్కులన్నా జగన్ రెడ్డికి ఏమాత్రం గౌరవం లేదు. జగన్ రెడ్డి చేస్తున్న పనులకు.. చెప్తున్న మాటలకు కనీసం పొంతన లేదు. అలాంటి వ్యక్తి పౌర హక్కులంటూ నేడు సమావేశం ఏర్పాటు చేయడం హాస్యాస్పదం'' అని యనమల మండిపడ్డారు. 


 
 

Follow Us:
Download App:
  • android
  • ios