చంద్రబాబుపై పార్టీలోని కొందరు ఎస్సీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ అసంతృప్తి కూడా అంబేద్కర్ జయంతి రోజే బయటపడటం గమనార్హం.
చంద్రబాబుపై పార్టీలోని కొందరు ఎస్సీ నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆ అసంతృప్తి కూడా అంబేద్కర్ జయంతి రోజే బయటపడటం గమనార్హం. అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటుకు శంకుస్ధాపన చేసారు. అంబేద్కర్ పై తనకు అపారమైన గౌరవ, మర్యాదలున్నట్లు చెప్పారు. ఇంత వరకూ బాగానే ఉంది. మరి, ఆమాట నిజమైతే అదే అంబేద్కర్ రచించిన రాజ్యంగాన్ని ఏ విధంగా తుంగలో తొక్కుతున్నారు? తాజా ఫిరాయింపులే అందుకు ఉదాహరణ. రాజ్యాంగం ప్రకారం పార్టీలు మారే ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేయాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది.
వైసీపీకి చెందిన 21 మంది ఎంఎల్ఏలు ఫిరియించి టిడిపిలో చేరారు. వారంతా చేరి దాదాపు ఏడాది గడచిపోయినా ఇంత వరకూ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు. పైగా వారిలో కొందరు రాజీనామాలకు సిద్ధపడినా చంద్రబాబు వారిని వారించారని ఫిరాయింపు ఎంఎల్ఏలే చెబుతున్నారు. అంబేద్కర్ అంటే గౌరవం, మర్యాదులన్న వ్యక్తి మరి రాజ్యాంగాన్ని ఉల్లంఘించటమేమిటి? పైగా ఫిరాయింపుల్లో నలుగురికి మంత్రిపదవులు ఇవ్వటం ద్వారా తనకు రాజ్యాంగమన్నా, చట్టం, నిబంధనలన్నా లెక్కే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు.
దళితుల పట్ల చంద్రబాబునాయుడు ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందంటూ పార్టీ ఎంపి శివప్రసాదే ప్రశ్నిస్తున్నారు. పైగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులన్నింటినీ చంద్రబాబు దారిమళ్ళిస్తున్నట్లు చేసిన ఆరోపణలు ఆలోచించదగ్గవే. ఒవైపు ఎస్సీలను ప్రభుత్వం అణగ దొక్కేస్తోందంటూ ఎంపినే ఆరోపిస్తుంటే ఇంకోవైపేమో చంద్రబాబు అంబేద్కర్ విగ్రహాలకు శంకుస్ధాపన చేయటంలొ అర్ధమేముంది?
ఇదిలావుండగా కడప జిల్లాలో ఎస్సీలు పలువురు నిరాహారదీక్షకు కూడా కూర్చున్నారు. తమను పార్టీ నాయకత్వం మొసం చేసిందంటూ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఆరోపించారు. తమను పార్టీ నాయకత్వం అంటరానివారుగా చూస్తోందంటూ వాపోయారు. పార్టీ కోసం 15 ఏళ్ళుగా పనిచేసిన తమను ఇపుడు పార్టీ అధినేత దూరంగా పెట్టారంటూ ధ్వజమెత్తటం గమనార్హం.
