Telugudesham Party : కొత్త సంవత్సరంలో సరికొత్త జోష్ ... 'రా... కదలిరా' అంటూ ప్రజల్లోకి చంద్రబాబు
ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఇక ప్రజల్లోనే వుండేలా టిడిపి అధినేత చంద్రబాబు కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. ఈ క్రమంలోనే జనవరి 5 నుండి సరికొత్త ప్రచార కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించనున్నారు.
అమరావతి : 2024 సంవత్సరం యావత్ దేశానికే కాదు ఆంధ్ర ప్రదేశ్ కు ఎలక్షన్ ఇయర్. మరో రెండుమూడు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అటు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి రాష్ట్రంలో అధికారాన్ని, ఇటు లోక్ సభలోన అధిక సీట్లు సాధించి కేంద్రంలో కీలకంగా వ్యవహరించాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఇలా ఇప్పటికే వివిధ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతున్న ప్రతిపక్ష తెలుగుదేశం కొత్త సంవత్సరంలో సరికొత్తగా సిద్దమయ్యింది. జగన్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడం, టిడిపి అధికారంలోకి వస్తే ఏమేం చేస్తుందో వివరించడానికి స్వయంగా టిడిపి అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్ళనున్నారు. "రా... కదలి రా!" పేరిట చంద్రబాబు ప్రతిరోజు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలను చుట్టివచ్చేలా టిడిపి కార్యాచరణ సిద్దం చేసింది.
1983 లో తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో టిడిపిని స్థాపించిన దివంగత ఎన్టీఆర్ కూడా ఇలాగే 'రా... కదలిరా'అంటూ పిలుపునిచ్చి ప్రభంజనం సృష్టించారని ఆంధ్ర ప్రదేశ్ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు గుర్తుచేసారు. అదే స్పూర్తితో చంద్రబాబు కూడా ఈసారి ప్రజల్లోకి వెళుతున్నారని తెలిపారు. జనవరి 5 నుంచి 29 వరకు ఒక్కోరోజు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బహిరంగ సభలు వుంటాయని... వాటిలో అధినేత చంద్రబాబు పాల్గొంటారని తెలిపారు. టిడిపి ఆవిర్భావంతో ఎన్టీఆర్ కు బ్రహ్మరథం పట్టినట్లే ఈ 'రా... కదలిరా' సభల్లో చంద్రబాబు ప్రభంజనం కనబడుతుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
రా...కదలిరా సభల వివరాలు :
జనవరి 5న కనిగిరిలో మొదటి సభ
జనవరి 6 - తిరువూరు,ఆచంట
జవవరి 9 - వెంకటగిరి,ఆళ్లగడ్డ
జనవరి 10 - బొబ్బిలి,తుని
జనవరి 18 - గుడివాడ
జనవరి 19 - గంగాధర నెల్లూరు,కమలాపురం
జనవరి 20 - అరకు,మండపేట
\
జనవరి 24 - పీలేరు,ఉరవకొండ
జనవరి 25 - కోవూరు,పత్తికొండ
జనవరి 27 - గోపాలపురం,పొన్నూరు
జనవరి 28 - మాడుగుల,టెక్కలి
జనవరి 29 - ఉంగుటూరు,చీరాల
జనవరి 18న ఎన్టీఆర్ వర్దంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించే 'రా... కదలిరా' సభ భారీగా వుంటుందని అచ్చెన్నాయుడు తెలిపారు. టిడిపి ప్రచార సభలను విజయవంతం చేయాలని టిడిపి, జనసేన శ్రేణులకు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.ఇప్పటినుండి టిడిపి, జనసేన పార్టీలు సంయుక్తంగాే ముందుకు వెళతాయన్నారు. త్వరలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొనే సభల వివరాలు ప్రకటిస్తామని అచ్చెన్న తెలిపారు.
ఇక ఈ ఎన్నికల్లో టిడిపి-జనసేన పార్టీ కలిసి పోటీచేయనున్న నేపథ్యంలో ఇరుపార్టీల గుర్తులతో సరికొత్త లోగోను రూపొందించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. సైకిల్, గాజు గ్లాసు గుర్తులతో కూడిన ఉమ్మడి లోగోను అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఈ లోగో మాదిరిగానే టిడిపి, జనసేన శ్రేణులు కలిసికట్టుగా పనిచేసి వైసిపిని ఓడించాలని అచ్చెన్నాయుడు సూచించారు.
అధికారంలోకి వచ్చింది మొదలు విధ్వంసాలు, అరాచకాలతో జగన్ రాష్ట్రాన్ని చీకటిమయం చేసారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ కాస్త వైసిపి పాలనలో ఆందోళనప్రదేశ్ గా మారిందన్నారు. ఈ రాక్షన పాలన ముగిసి రాష్ట్రానికి స్వర్ణయుగం రావాలంటే టిడిపి తిరిగి అధికారంలోకి రావాలన్నారు.