Asianet News TeluguAsianet News Telugu

విశాఖలో చంద్రబాబు అరెస్ట్, ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌కు తరలింపు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆయన ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం విశాఖకు వచ్చారు

tdp chief chandrabau naidu arrested in visakhapatnam airport
Author
Visakhapatnam, First Published Feb 27, 2020, 4:13 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆయన ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం విశాఖకు వచ్చారు. అయితే పోలీసులు, వైసీపీ నేతలు చంద్రబాబును అడ్డుకోవడంతో  ఆయన ఉదయం నుంచి ఇప్పటి వరకు విమానాశ్రయంలోనే బైఠాయించారు.

ఆ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొనడంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ముందుగా చంద్రబాబును ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌కు తరలించేందుకు గాను సెక్షన్151 కింద నోటీసు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఆ వెంటనే టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Also Read:నన్ను షూట్ చేయండి: పోలీసులపై చంద్రబాబు మండిపాటు

‘‘ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు అయిన మీ యొక్క భద్రత దృష్ట్యా మిమ్ములను మరియు మీ అనుచరులను రక్షణ నిమిత్తము సీఆర్‌పీసీ 151 సెక్షన్ ప్రకారం ముందస్తు అరెస్ట్ చేస్తూ ఈ నోటీస్ ద్వారా మీకు తెలుపుతున్నాము. ఇందుకు మీరు సహకరించవలసిందిగా కోరుచున్నామని’’ నోటీసులో పేర్కొన్నారు.

అంతకుముందు విశాఖపట్నంలో తను నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రను వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భగ్గుమన్నారు. పోలీసుల తీరుపై మండిపడిన ఆయన కావాలంటూ తనను షూట్ చేయండి అంటూ వ్యాఖ్యానించారు.

వైసీపీ కార్యకర్తల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో తాను రెండు రోజుల పాటు యాత్ర నిర్వహిస్తానని ముందే పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. స్థానిక టీడీపీ నేతలతో పాటు విజయనగరంలో కూడా పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్నారని బాబు స్పష్టం చేశారు.

Also Read:నాడు జగన్‌, నేడు బాబు: విశాఖ ఎయిర్‌పోర్టులో సీన్ రిపీట్

తాను విశాఖకు వచ్చిన తర్వాత వైసీపీ నేతలు డబ్బులిచ్చి మనుషులను తీసుకొచ్చి పెద్ద ఎత్తున తనపైనా, టీడీపీ కార్యకర్తలపైనా కోడిగుడ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లు చివరికి రాళ్లు కూడా వేయించారని చంద్రబాబు మండిపడ్డారు. ఒక గంటలో పంపిస్తామని చెప్పి గంటల తరబడి తనను వెయిట్ చేయించి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సిందిగా చెబుతున్నారని దుయ్యబట్టారు. 

tdp chief chandrabau naidu arrested in visakhapatnam airport

Follow Us:
Download App:
  • android
  • ios