అమరావతి: చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల గృహ నిర్భంధాన్ని నిరసిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు  జిల్లా ఎస్పీకి లేఖ రాశాడు.

హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు నీరందించాలని కోరుతూ రామకుప్పం మండలంలో టీడీపీ నేతలు సోమవారం నాడు తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకొన్నారు.

అంతేకాదు పలువురు టీడీపీ కార్యకర్తలు, నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  ఈ విషయాన్ని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు.  ఈ విషయమై చిత్తూరు జిల్లా ఎస్పీకి ఆయన మంగళవారం నాడు లేఖ రాశాడు.

శాంతియుత ఆందోళనల ద్వారా సాగునీటి సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు కుప్పం ప్రజలు ప్రయత్నం చేశారని ఆ  లేఖలో చంద్రబాబు గుర్తు చేశారు.

ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడం ప్రభుత్వం బాధ్యతగా ఆయన చెప్పారు. అయితే ప్రజల అవసరాల కంటే ఇతర  ప్రాధాన్యాంశాలే ప్రభుత్వానికి ఎక్కువగా కన్పిస్తున్నాయని ఆయన ఆ లేఖలో ఆరోపించారు.

చిత్తూరు పోలీసులు రాజ్యాంగ స్పూర్తికి విరుద్దంగా వ్యవహరించారన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన ఆ లేఖలో ఎస్పీని కోరారు.