మండలి రద్దు అంత ఆషామాషీ కాదంటున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. ఆదివారం జరిగిన టీడీఎల్పీ సమావేశలో భాగంగా మండలి రద్దు, వికేంద్రీకరణ బిల్లు తదితర అంశాలపై చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సుదీర్ఘంగా చర్చించారు.

ఒకవేళ శాసనమండలిని రద్దు చేయాలని నిర్ణయించినా అది అమలు కావడానికి రెండేళ్ల సమయం పడుతుందని ఆ పార్టీ నేత యనమల తెలిపారు. మండలి రద్దు, పునరుద్ధరణలకు సంబంధించి వివిధ రాష్ట్రాలు పంపిన తీర్మానాలు ఇప్పటికే కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. మండలి రద్దు వైసీపీ కూడా నష్టం కలిగిస్తుందన్నారు.

Also Read:సెలెక్ట్ కమిటీ ఏర్పాటులో తొలి అడుగు: పేర్లు ఇవ్వాలని పార్టీలకు షరీఫ్ లేఖ

సీఎం జగన్ నిర్ణయాలతో ప్రభుత్వానికి నష్టం తప్పదని పలువురు అభిప్రాయపడ్డారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... అంతా తను చెప్పినట్లు జరగాలని జగన్ భావిస్తున్నారని.. మెజారిటీ లేకపోయినా కౌన్సిల్ కూడా తను చెప్పినట్లు జరగాలని భావిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

అసెంబ్లీలో రింగు గీసి.. అది దాటి వచ్చిన వారిని బయట పడేయమంటారని బాబు మండిపడ్డారు. మంత్రులు శాసనమండలిలో పోడియం ఎక్కినా మార్షల్స్ అడ్డుకోరని.. తన రూమ్‌లో కట్ చేస్తే, టీవీ ఆపేస్తే, ఇంటర్నెట్ బంద్ చేస్తే కౌన్సిల్ గ్యాలరీకి వెళ్లిన ప్రధాన ప్రతిపక్షనేతను బయటకు వెళ్లమని మార్షల్స్‌ అంటారని ఆయన ధ్వజమెత్తారు.

పార్టీ అధ్యక్షుడిగా తాను అన్నివిధాలా అండగా ఉంటానని చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు. శాసన మండలి ఇప్పటివరకు అనేక బిల్లులను ఆమోదించి పంపింది. 3 రాజధానులపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకత, 13జిల్లాల్లో జరుగుతున్న ఆందోళనలను దృష్టిలో ఉంచుకునే ఈ 2 బిల్లులను సెలెక్ట్ కమిటికి పంపిందని ఆయన గుర్తుచేశారు.

Also Read:మండలి రద్దుపై రేపు జగన్ కీలక ప్రకటన: సమావేశాలకు టీడీపీ దూరం

పరిటాల రవి అనుచరులుగా అండర్‌గ్రౌండ్‌లో కష్టపడ్డారనే చమన్, పోతుల సురేశ్‌లను టీడీపీ అధికారంలోకి రాగానే గౌరవించామన్నారు. పోతుల సునీత రెండు సార్లు ఓడిపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించామని, టీడీపీ మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా చేశామని ఇంతలా గౌరవించినా ఆమె పార్టీని విడిచి వెళ్లిపోవడం బాధాకరమన్నారు.