Asianet News TeluguAsianet News Telugu

శ్రీకాకుళం టిడిపి నాయకుల అరెస్ట్... చంద్రబాబు సీరియస్

స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తానన్న వైసీపీ మంత్రులు, నేతలను వదిలి టిడిపి నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ సీఎం చంద్రబాబు అన్నారు.

tdp chief chandrababu serious on TDP Leaders Arrest
Author
Amaravathi, First Published Dec 24, 2020, 12:20 PM IST

శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతల అరెస్టు అప్రజాస్వామికమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తానన్న వైసీపీ మంత్రులు, నేతలను వదిలి టిడిపి నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు.

''శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కూన రవికుమార్, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ, గౌతు శిరీషలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కు. పౌరుల హక్కులను జగన్ రెడ్డి కాలరాస్తున్నారు'' అని చంద్రబాబు ఆరోపించారు.

''స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహాన్ని కూలుస్తామని మంత్రి సీదిరి అప్పల్రాజు చేసిన వ్యాఖ్యలపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన సర్దార్ గౌతు లచ్చన్న గారిని అవమానించిన వైసీపీ నేతలు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. గృహ నిర్బంధం చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలి'' అని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Read more వెంకన్నతో పెట్టుకుంటే.. ఏమవుతుందో జగన్ కి బాగా తెలుసు : నారా లోకేష్..

ఇవాళ(గురువారం) శ్రీకాకుళం జిల్లా పలాసలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గౌతు లచ్చన్న విగ్రహంపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అప్పలరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు నిరసనకు దిగారు. గౌతు లచ్చన్న విగ్రహానికి నివాళులు అర్పించి, క్షీరాభిషేకం చేయాలని తలపెట్టారు. ఈ క్రమంలో టీడీపీ నేతలను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడిని పోలీసులు నిమ్మాడలో అరెస్టు చేశారు. గౌతు లచ్చన్న విగ్రహం వరకు వెళ్లడానికి టీడీపీ కార్యాలయానికి చేరుకున్న గౌతు శిరీషను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 

పలాస, కాశీబుగ్గ ప్రాంతాల్లో పోలీసులు 144వ సెక్షన్ విధించారు. గౌతు లచ్చన్న విగ్రహాన్ని కబ్జా స్థలంలో ఏర్పాటు చేశారని, దాన్ని తొలగిస్తామని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. దానిపై టీడీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో గురువారం టీడీపీ పలాస పట్టణ అధ్యక్షుడు లొడగల కామేశ్వర రావు గురువారం నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. లచ్చన్న విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల టీడీపీ ఇంచార్జీలు, జిల్లా కార్యవర్గ సభ్యులు హాజరవుతారని ఆయన చెప్పారు. 

గురువారం లచ్చన్న విగ్రహం వద్ద నిరసన చేపట్టడానికి బయలుదేరుతున్న నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios