అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్దంగా ఉండాలని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ నేతలను కోరారు. 

మంగళవారం నాడు చంద్రబాబు నాయుడుపార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తోందని ఆయన విమర్శలు గుప్పించారు.  స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే గెలవలేమనే భయంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని ఆయన విమర్శించారు. 

బాధిత వర్గాలన్నీ కూడ వైసీపీని ఓడిస్తారనే భయంతో స్థానిక సంస్థల ఎన్నికలను కరోనాను సాకుగా చూపి  వాయిదా వేస్తున్నారన్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని ఏ రకమైన అన్యాయం జరిగిందే విషయమై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన కోరారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ వర్గాల్లో వైసీపీ అంటే వ్యతిరేకత నెలకొందని ఆయన విమర్శించారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఏపీ ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. అయితే కరోనా కారణంగా ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దంగా లేదు.ఈ విషయమై తమకు సహకరించాలని కోరుతూ ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సోమవారం నాడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీకి మరో లేఖ కూడా రాశారు.