అమరావతి:  కరోనా బారినపడిన ప్రముఖ సినీ నేపథ్యగాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్యంగా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 5న కరోనా లక్షణాలతో చెన్నై ఎంజీఎంలో చేరిన ఆయన ఆరోగ్యం గురువారం రాత్రి నుంచి విషమంగా మారడంతో వైద్యులు ఐసీయూకి తరలించారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనను వ్యక్తం చేస్తూ ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. 

''కరోనా చికిత్సలో ఉన్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారిని ఐసీయూకి తరలించారన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. ఆయన త్వరగా కోలుకుని కరోనా నుంచి క్షేమంగా బయటపడాలని భగవంతుని మనసారా ప్రార్థించుదాం'' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

read more   ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం విషమం: ఐసీయూకు తరలింపు

బాలసుబ్రమణ్యం ఆరోగ్యంపై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేశాయి. నిపుణులైన డాక్టర్లు ఎస్పీ బాలుని పర్యవేక్షిస్తున్నారని వైద్యులు చెప్పారు. లైఫ్ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం బాలు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గానే ఉందని ఎంజీఎం వర్గాలు తెలిపాయి. 

బాలును వైద్యులు హోం ఐసోలేషన్‌లో ఉండమని చెప్పినా.. కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం లేక ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అంతేకాదు తనకు కరోనా సోకిన విషయాన్ని ఓ సెల్ఫీ వీడియో ద్వారా బాలసుబ్రమణ్యం అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.