మాంటిస్సోరి విద్యాసంస్థల వ్యవస్ధాపకురాలు, సామాజికవేత్త కోటేశ్వరమ్మ భౌతికకాయానికి టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. విజయవాడ లబ్బీపేటలోని ఆమె నివాసానికి చేరుకున్న బాబు... కోటేశ్వరమ్మ కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటేశ్వరమ్మ లేని లోటు తీర్చలేనిదని... ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. మహిళా విద్యకు మాంటిస్సోరి విద్యాసంస్థల కోటేశ్వరమ్మ మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు.

ఆమె అందరికీ ఓ స్పూర్తిదాయకమైన వ్యక్తని, అర్థవంతమైన జీవితం గడిపారని చంద్రబాబు పేర్కొన్నారు. ఉపాధ్యాయురాలిగా జీవితాన్ని ప్రారంభించిన కోటేశ్వరమ్మ... కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలను నెలకొల్పడం అభినందనీయమన్నారు.

మహిళల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడ్డారని.. ఆమెకు తానంటే ఎంతో అభిమానమని.. ఎప్పుడు కలిసినా అప్యాయంగా పలకరించేవారని కోటేశ్వరమ్మతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చంద్రబాబు.