Asianet News TeluguAsianet News Telugu

ఆ వివరాలను వెంటనే తెలియజేయండి: సీఎస్ కు చంద్రబాబు లేఖ

రైతుల సమస్యల గురించి ప్రశ్నిస్తూ ఆంధ్ర ప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీలం సహానికి టిడిపి చీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. 

TDP Chief Chandrababu Naidu Writes open Letter to Chief Secretary
Author
Amaravathi, First Published Apr 22, 2020, 8:19 PM IST

గుంటూరు: రాష్ట్రంలో కరోనా విజృంభణ, లాక్ డౌన్ కారణంగానే కాకుండా ప్రభుత్వ చర్యల వల్ల  కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పండించిన పంటలకు మద్దతు ధర లేక కొందరు రైతులు పంటలను దున్నేస్తే మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో పంటల కొనుగోలుకు సంబంధించిన వివరాలను తెలియజేయాలంటూ ప్రభుత్వ ప్రదాన కార్యదర్శికి చంద్రబాబు లేఖ రాశారు. 

సీఎస్ కు చంద్రబాబు రాసిన లేఖ యదావిధిగా...

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి,

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం,

అమరావతి.

మేడమ్, 


విషయం: కోవిడ్ 19 – లాక్ డౌన్ తో దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వ సహకారం –కనీస మద్దతు ధర లభించక ఉద్యాన, ఆక్వా మరియు రబీ రైతాంగం సంక్షోభంలో చిక్కుకోవడం-రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు-మండల, జిల్లాలవారీగా వివిధ పంటల సాగు విస్తీర్ణం,  దిగుబడుల అంచనా, వాస్తవ దిగుబడులు, ప్రభుత్వ జోక్యం ద్వారా పంట ఉత్పత్తుల సేకరణ-మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధి నుంచి చేసిన ఖర్చులు-వివరాలను తెలియజేయడం గురించి

Ref: 26.03.2020 తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి రాసిన లేఖ.

కరోనా తీవ్రత, కోవిడ్ వైరస్ వ్యాప్తి మరియు లాక్ డౌన్ కారణంగా ప్రజా జీవితాల్లో సుడిగుండాలను సృష్టించడం గురించి మీకు తెలిసిందే. పైన పేర్కొన్న లేఖలో రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాల గురించి గతంలోనే మీ దృష్టికి తెచ్చాను. రాష్ట్రంలో హార్టీకల్చర్, ఆక్వా కల్చర్ మరియు రబీ పంటల రైతుల సమస్యల గురించి మీకు మరోసారి తెలియజేస్తున్నాను. 

కనీస మద్దతు ధర(ఎంఎస్ పి) లభించక అనేకమంది రైతులు తమ పంటలను దున్నేస్తున్నారు, మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా సృష్టించిన కల్లోలం నుంచి రైతులను కాపాడుకోవాల్సిన తక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం తరఫున తీసుకున్న చర్యల గురించి ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి  టమాటా, బొప్పాయి, మామిడి, అరటి, బత్తాయి, పుచ్చ, కర్భూజ, మిర్చి, తదితర ఉద్యాన పంటలు, మరియు ధాన్యం, పప్పుధాన్యాలు, మొక్కజొన్న తదితర రబీపంటలు, చేపలు, రొయ్యలు మొదలైన వాటి సాగు విస్తీర్ణం ఆయా పంటలవారీగా మరియు వాటి దిగుబడుల అంచనాలు, వాస్తవ దిగుబడి మరియు ప్రభుత్వ జోక్యం ద్వారా  సేకరించిన పంట ఉత్పత్తుల పరిమాణం, గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఆయా వివరాలను జిల్లా, మండలాల వారీగా తెలియజేయాలని కోరుతున్నాను. గత 2నెలల్లో మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధి నుంచి చేసిన మొత్తం వ్యయం మరియు 2020-21 సంవత్సరానికి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక వివరాలు కూడా తెలియజేయగలరు.

ధన్యవాదములతో...

నారా చంద్రబాబు నాయుడు,
,
శాసన సభ ప్రధాన ప్రతిపక్ష నేత. 

Follow Us:
Download App:
  • android
  • ios