భోగిమంటల్లో ప్రభుత్వ రైతు వ్యతిరేక జీవోలను తగులపెట్టాలని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మంగళవారం టీడీపీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... సంక్రాంతి వేళ రైతుకు ఏమిటీ కష్టమని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. భోగి మంటలు వెలగాల్సిన కూడళ్లలో అన్నదాతల గుండె మంటలా అంటూ ఆయన ఎద్దేవా చేశారు. 

వరుసగా చోటు చేసుకున్న ఏడు విపత్తులతో రైతులు పూర్తిగా నష్టపోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. భారీవర్షాలకు తడిసి రంగుమారిన ధాన్యం కొనేవాళ్లు లేరని.. దళారుల ఇష్టారాజ్యంగా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

చివరికి మంగళవారం కూడా కర్నూలులో టమాటా ధర లేక రోడ్లపై పారబోశారని బాబు చెప్పారు. కిలో టమాటా 30 పైసలకు కూడా కొనేవాళ్లు లేరని .. రేటు లేక అరటి తోటలను దున్నేస్తున్నారన్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

అరటి ధర టన్ను రూ. 8 వేల నుంచి రూ. 2 వేలకు పడిపోయిందని.. పండిన పంటలకు సైతం మద్దతు ధరలేదని ఆయన మండిపడ్డారు. విపత్తుల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం లేదని చంద్రబాబు మండిపడ్డారు.

వైసీపీ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక విధానాల వల్ల ఏడాదిన్నర కాలంలో 1,779 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. వైసీపీ పాలనలో రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు 55 శాతం పెరిగాయని చంద్రబాబు స్పష్టం చేశారు.

400 రోజులుగా అమరావతి రైతులు, రైతుకూలీలు ఆందోళన చేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రతిపక్షనేత ఆరోపించారు. 

స్థానిక ఎన్నికలకు వైసీపీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ గ్రామ స్వరాజ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ ఓటమే అందరి లక్ష్యం కావాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు.