వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. బుధవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. రాష్ట్ర యువతకు ప్రపంచ యువజనోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఇనుప నరాలు, ఉక్కు కండరాలు కలిగిన 100 మంది యువకులను అప్పగిస్తే ఈ దేశగతినే మార్చేస్తా అని స్వామి వివేకానందుడు అన్నారని చంద్రబాబు గుర్తుచేశారు. అలాంటి యువశక్తి రాష్ట్రంలో ఈ రోజు నిర్వీర్యమైపోతుండటం బాధ కలిగిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గత 14 నెలల్లో ఏపీలో ప్రభుత్వం యువతను పూర్తిగా పక్కనపెట్టిందని, ఉద్యోగాల భర్తీ లేదని చంద్రబాబు ధ్వజమెత్తారు. చివరికి నిరుద్యోగ భృతి లేదని, యువతీ యువకులకు సబ్సిడీపై రుణాలను అందించి స్వయం ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం ఆ మార్చే పోయిందని ప్రతిపక్షనేత మండిపడ్డారు.

క్రీడల్లో అయితే ప్రోత్సాహం అసలే లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతి ఏడాది జాబ్స్ క్యాలెండర్ అన్నారు.. ఏమైందని టీడీపీ చీఫ్ ప్రశ్నించారు. ఎక్కడైతే యువశక్తి నిర్వీర్యం అవుతుందో అక్కడ అభివృద్ధి తిరోగమనబాట పడుతుందన్నారు. అదిప్పుడు ఏపీలో ప్రత్యక్షంగా చూస్తున్నామని.. ఇప్పటికైనా యువతలో ఆత్మస్థైర్యం నింపే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.