పరిపాలన చేతకాకపోయినా అక్రమ కేసులకు రాష్ట్రంలో కొదవలేదన్నారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. పులివెందులలో హత్యకు గురైన దళిత మహిళ కేసులో దోషులను శిక్షించాలని ఆందోళన చేసిన టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.

ఎస్టీ, ఎస్సీలను రక్షించుకోవడానికి ఉన్న చట్టాలను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని చంద్రబాబు ధ్వజమెత్తారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తే అమలయ్యేది రాజారెడ్డి రాజ్యాంగం అనక మరేమనాలని ఆయన ప్రశ్నించారు.

ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా తయారవుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. మనం రాచరికంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అంటూ ఆయన దుయ్యబట్టారు.

నిందితులను అరెస్టు చేయాలని అడగడం తప్పా.? అని ప్రతిపక్షనేత ప్రశ్నించారు. ఏ నేరం చేశారని నిరసనకారులపై అట్రాసిటీ కేసులు పెట్టారని.. వైసీపీ నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీలను హతమార్చినా, శిరోముండనాలు చేసినా, దాడులు చేసినా కేసులుండవని ఆయన ధ్వజమెత్తారు.

న్యాయం కోసం పోరాడిన వారిపై మాత్రం అరక్షణంలో అక్రమ కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. శాంతియుత ప్రదర్శనలు, నిరసనలు జరిపే ప్రాధమిక హక్కు రాజకీయ పార్టీలకు, ప్రజలకు వుందని ఆయన స్పష్టం చేశారు.