గ్రామాల్లో జ‌గ‌న్ .. విద్యుత్తును పీకేస్తున్నార‌ని, ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రి పదవి నుంచి పీకేసేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. 

ఏపీలో విద్యుత్ చార్జీల పెరుగుద‌ల‌ , క‌రెంటు కోత‌ల‌పై టీడీపీ (tdp) ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) శనివారం త‌మ పార్టీ నేత‌ల‌తో క‌లిసి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌తి టీడీపీ నేత (telugu desam party) ఈ ఆందోళ‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని ఆయ‌న దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయికి వెళ్లి ప్ర‌జ‌లకు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను వివ‌రించాలని సూచించారు. ఏపీలో విద్యుత్ కోతలు, పెరిగిన కరెంట్ చార్జీలపై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఏపీలో పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఇలాగే కొన‌సాగితే కార్మికులకు ఉపాధి క‌రవ‌వుతుంద‌ని ఆయన ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అలాగే, పంటలకు నీరందక రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటార‌ని ప్రతిపక్షనేత ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో జ‌గ‌న్ .. విద్యుత్తును పీకేస్తున్నార‌ని, ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రి పదవి నుంచి పీకేసేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు,.

కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలతో (power cuts in ap) ప్రజలు తీవ్ర అవస్తలు పడుతున్నారు. అవసరాన్ని బట్టి డిస్కమ్‌లు గ్రామీణ ప్రాంతాల్లో పగటిపూట 4 గంటల వరకు కరెంటు కోతలు విధిస్తున్నారు. ఇక, మున్సిపల్‌ ప్రాంతాల్లో రెండు గంటలపాటు విద్యుత్‌ కోత విధిస్తున్నారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో కరెంట్ కోతలు విధిస్తున్నారు. అయితే ఈ పవర్ కట్స్ చెబుతున్న సమయం కన్నా ఎక్కువగానే ఉంటున్నాయి. గ్రామాలు, పట్టణాల అన్న తేడా లేకుండా ఎడాపెడా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కొన్ని సమయాల్లో రాత్రిపూట కూడా కరెంటు కోతలు విధిస్తున్నారు.

రాత్రి, పగలు తేగా లేకుండా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఓవైపు.. ఎండ తీవ్రత.. మరోవైపు విద్యుత్ కోతలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండు వేసవిలో సమయం సందర్భం లేకుండా గంటల తరబడి విద్యుత్ కోతలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాత్రివేళ గంటల తరబడి కరెంటు కట్​ చేయడంతో నరకయాతన అనుభవిస్తున్నామని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాలలో షెడ్యూల్‌ లేని విద్యుత్ కోతల కారణంగా జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నగరాల్లో కూడా ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ కోతలు విధించడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిళ్లు కూడా కరెంట్ కోతలతో.. పసిపిల్లల తల్లులు విసనకర్రలతో గాలి విసురుతూ కూర్చోవాల్సి వస్తోంది. 

విద్యార్థులు, పరీక్షలకు సన్నద్దమవుతున్న వారు కూడా కరెంట్ కోతలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పగలంతా తరగతి గదుల్లో ఉండి రాత్రిళ్లు ప్రశాంత నిద్ర లేక ఒత్తిడికి గురవుతున్నారు. కరెంట్ కోతల నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షలు సమీపిస్తున్న సమయంలో ఇలా విద్యుత్ కోతలు విధిస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కరెంట్ కోతలతో చిరువ్యాపారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల విద్యుత్ కోతలను వ్యతిరేకిస్తూ రైతులు, ప్రజలు.. విద్యుత్ సబ్ స్టేషన్‌ల ఎదుట ఆందోళనలు చేపడుతున్నారు. మరోవైపు విద్యుత్ కోతలపై ఫిర్యాదులు కూడా వెల్లువెత్తున్నాయి. కాల్ చేసి ఫిర్యాదు చేస్తున్న కొందరు.. విద్యుత్ కోతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే కోతలు విధించే షెడ్యూల్‌ ప్రకటించాలని అడుగుతున్నారు. 

అయితే ప్రస్తుతం ఏపీలో అమలవుతున్న విద్యుత్ ఇబ్బందులు (ap power crisis) తాత్కాలికమేనని అన్నారు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి. ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఇదే తరహా పరిస్ధితి వుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏపీలో 230 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ వుందని ఇంధన శాఖ కార్యదర్శి వెల్లడించారు. ఏపీలో 180 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని ఆయన చెప్పారు. గృహ, వ్యవసాయ వినియోగానికి ఆటంకాలు కలగనివ్వమన్నారు. అందుకే పరిశ్రమల్లో విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధించామని ఇంధన శాఖ కార్యదర్శి చెప్పారు. 

పరిశ్రమల్లో విద్యుత్ ఆంక్షలతో 20 మిలియన్ యూనిట్ల భారం తగ్గుతుందని ఆయన తెలిపారు. మరో 30 మిలియన్ యూనిట్లను బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తామని ఇంధన శాఖ కార్యదర్శి వెల్లడించారు. రూరల్ ప్రాంతాల్లో ఓ గంట .. అర్బన్‌లో అరగంట విద్యుత్ కోతలు విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏపీలోని ధర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత వుందని ఇంధన శాఖ కార్యదర్శి పేర్కొన్నారు. గతంలో 24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు వుండేవని.. ఇప్పుడు లేవని ఆయన తెలిపారు. బొగ్గు తెచ్చుకుంటూ విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకుంటున్నామన్నారు.