ఓడిపోతానని జగన్‌కి అర్ధమైపోయింది.. ఆ మాటల్లో తేడా అందుకే : చంద్రబాబు నాయుడు
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. హ్యాపీగా దిగిపోతానని జగన్ అంటున్నారంటే.. ఓటమి ఖాయమని తెలిసే ఆయన మాటల్లో తేడా వచ్చిందన్నారు. ఉమ్మడి అనంతలోని 14 సెగ్మెంట్లలోనూ టీడీపీ జనసేన కూటమిదే విజయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శనివారం అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉరవకొండలో టీడీపీ జనసేన గాలి వీస్తోందని, ఈ సభకు వచ్చిన జనాన్ని చూస్తే జగన్‌కు నిద్రపట్టదన్నారు. ఉమ్మడి అనంతలోని 14 సెగ్మెంట్లలోనూ టీడీపీ జనసేన కూటమిదే విజయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. హ్యాపీగా దిగిపోతానని జగన్ అంటున్నారంటే.. ఓటమి ఖాయమని తెలిసే ఆయన మాటల్లో తేడా వచ్చిందన్నారు.
జగన్ పాలనలో నష్టపోని వ్యవస్థ ఒక్కటీ లేదని, రాష్ట్రానికి పట్టిన శని పోయేందుకు ఇంకా 74 రోజులే వుందని చంద్రబాబు దుయ్యబట్టారు. రాష్ట్రం ఒక్కసారిగా 30 ఏళ్లు వెనక్కిపోయిందని, అనంతపురం జిల్లాకు నీరు ఇస్తే బంగారం పండిస్తారని.. ఈ జిల్లాలో ప్రతి ఎకరానికి నీరు ఇవ్వాలనేది తన లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో రూ.4500 కోట్లు ఖర్చుతో హంద్రీనీవా, కాలువల విస్తరణ పనులు చేశామని ఆయన గుర్తుచేశారు. గోదావరి నీళ్లను రాయలసీమకు తీసుకురావాలని అనుకున్నామని, 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందించామని చంద్రబాబు తెలిపారు.
యువతకు ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు వచ్చేలా టీడీపీ చేస్తే.. జగన్ ప్రభుత్వం మాత్రం ఫిష్ మార్ట్, మద్యం దుకాణాల్లో ఉద్యోగాలు ఇచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి వుంటే లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు పేర్కొన్నారు. 2047 నాటికి తెలుగుజాతి నెంబర్ వన్ కావాలని, యువతకు ఏటా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు.