Asianet News TeluguAsianet News Telugu

దోచుకునే వరకు ఆగి.. చివర్లో ఎమ్మెల్యేల మార్పులా , జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు : చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్‌కు జగన్ అక్కర్లేదని సర్వేలు చెబుతున్నాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. 45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎంతోమంది సీఎంలను చూశానని, కానీ ఇలాంటి దారుణమైన ముఖ్యమంత్రిని, పాలనను చూడలేదన్నారు. 

tdp chief chandrababu naidu slams ap cm ys jagan ksp
Author
First Published Jan 3, 2024, 6:29 PM IST

ఆంధ్రప్రదేశ్‌కు జగన్ అక్కర్లేదని సర్వేలు చెబుతున్నాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. బుధవారం ఆయన సమక్షంలో వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రయ్య, మాజీ మంత్రి దాడి వీరభద్రరావుతో పాటు వివిధ జిల్లాలకు చెందిన అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. గాడితప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల్సిన అవసరం వుందన్నారు. 

45 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఎంతోమంది సీఎంలను చూశానని, కానీ ఇలాంటి దారుణమైన ముఖ్యమంత్రిని, పాలనను చూడలేదన్నారు. జగన్ ప్రభుత్వం రూ.12 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చినా అభివృద్ధి మాత్రం కుంటుపడిందని ఆయన దుయ్యబట్టారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని.. పాఠశాలల భవనాలకు రంగులే వేయడం అభివృద్ధి కాదన్నారు. టీడీపీ పాలనలో 100 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని.. వాటిని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు. విదేశీ విద్య కోసం ఒక్కొక్కరికి రూ.15 లక్షలు ఆర్ధిక సాయం చేశామని ఆయన గుర్తుచేశారు. 

సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని.. వైసీపీ నేతలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని చంద్రబాబు చురకలంటించారు. ఐదేళ్లుగా ఎమ్మెల్యేలు తప్పులు చేస్తుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది.. ఎవరికి కావాల్సింది వారు దోచుకుని తిన్నారని ఆయన ఆరోపించారు. కానీ ఇప్పుడేమో సర్వేల పేరు చెప్పి డ్రామాలు ఆడుతున్నారని.. ప్రజల్లో వ్యతిరేకత కనిపించడంతో ఎమ్మెల్యేలను మారుస్తున్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

జగన్ రాజధానిని మార్చలేరని.. ఆయన విశాఖ వెళ్లలేరని టీడీపీ చీఫ్ జోస్యం చెప్పారు. ఏప్రిల్ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వస్తుందని, టీడీపీ-జనసేనలు అధికారం కోసం ప్రయత్నించడం లేదని ఆయన స్పష్టం చేశారు. జగన్ రాజకీయాల్లో లేకపోతే ఏపీలో ఇంత విధ్వంసం జరిగేది కాదని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios