జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి ప్రజలు మోసపోయారని, ఇదే చివరి అవకాశం కావాలని టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు పిలుపునిచ్చారు. తిరుపతి ఉప‌ఎన్నిక నేపథ్యంలో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి తరపున ఆయన మంగళవారం గూడూరులో ప్రచారం నిర్వహించారు.

గూడూరులో రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయని బాబు ఎద్దేవా చేశారు. కరోనాను ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోయిందని,  ఏ సహాయం చేయలేదని ఆయన విమర్శించారు. కరోనాతో సహజీవనం చేయాలని, బ్లీచింగ్ వేస్తే పోతుందని జగన్ జనజీవన వ్యవస్థని నాశనం చేశాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:రాళ్లు విసిరారంటూ చంద్రబాబు కొత్త డ్రామా.. మండిపడ్డ బొత్స (వీడియో)

కరోనా సమయంలో మద్యం షాపులు తెరిచారని, చదువులు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద కాపలాపెట్టారంటూ చంద్రబాబు విమర్శించారు. జగన్ సొంత బ్రాండ్లు పెట్టి, సొంత షాపుల్లో అమ్ముతున్నాడంటే అంతకన్నా దారుణం ఉందా అని ఆయన ప్రశ్నించారు.

ఇసుకను కమీషన్ల కోసం సొంత మనుషులకిచ్చారని.. దీంతో ఇసుక ధరలకి రెక్కలొచ్చాయని చంద్రబాబు మండిపడ్డారు. ఇసుక దొరక్క 45 లక్షల మంది ఉపాధి కోల్పోయి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని.. ఇసుక, మద్యం అన్నింటిలోనూ అక్రమాలేనంటూ టీడీపీ చీఫ్ ఆరోపించారు. సిమెంట్ ధరలను అప్పట్లో నియంత్రించామని.. జగన్‌కి భారతీ సిమెంట్ ఫ్యాక్టరీ ఉందంటూ ఆయన ఎద్దేవా చేశారు.