సీఎం జగన్ అవినీతి చేశారని చెబుతున్నప్పుడు ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ ప్రభుత్వం రాగానే తప్పుడు కేసులు పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన రోడ్ షోలో జగన్ ప్రభుత్వం, కేంద్ర మంత్రులపై హాట్ కామెంట్స్ చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని.. జగన్ అంత అవినీతిపరుడు ఎవరూ లేరదంటూ స్వయంగా కేంద్ర మంత్రి అమిత్ షానే చెప్పారని చంద్రబాబు గుర్తుచేశారు. జగన్ అవినీతిపై కేంద్ర మంత్రులు ప్రకటనలు చేస్తున్నారని.. మరి చర్యలు ఎప్పుడు తీసుకుంటారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. కుప్పంలో గ్రానైట్‌ను వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని.. టీడీపీ ప్రభుత్వం రాగానే కక్కిస్తానని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
రూ.2 వేల నోట్లను వైసీపీ నేతలు బ్రాందీ షాపుల్లో మార్చుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు. మహిళలు, యువత, రైతులకు న్యాయం చేసేలా పథకాలు రూపొందించామని.. సంపద సృష్టిస్తేనే ఆదాయం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను కుప్పం నుంచే ప్రారంభిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. మైనారిటీల పథకాలను జగన్ రద్దు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని సీఎం రౌడీలకు నిలయంగా మార్చారని చంద్రబాబు మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని చంద్రబాబు ఆరోపించారు.
ALso Read: ఏపీకి రూ.5 లక్షల కోట్లు ఇచ్చాం .. మరి ఆ డబ్బంతా ఎవరి జేబుల్లోకి : జగన్ పాలనపై అమిత్ షా విమర్శలు
కాగా.. గత ఆదివారం విశాఖలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. రైతుల ఆత్మహత్యలపై వైసీపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో వుందని.. కానీ జగన్ తమది రైతు ప్రభుత్వమంటున్నారని అమిత్ షా దుయ్యబట్టారు. రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బును తామే ఇస్తున్నట్లు జగన్ చెబుతున్నారని.. మోడీ ఉచితంగా ఇచ్చే బియ్యంపైనా జగన్ ఫోటోలు వేసుకున్నారని ఆయన మండిపడ్డారు.
జగన్ పాలనలో విశాఖ అరాచక శక్తులకు అడ్డాగా మారిందని అమిత్ షా ఆరోపించారు. పదేళ్లలో ఏపీ అభివృద్ధికి రూ.5 లక్షల కోట్లు ఇచ్చామని ఆయన తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులకు తగినట్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కనిపిస్తుందా అని అమిత్ షా ప్రశ్నించారు. రూ.5 లక్షల కోట్ల అభివృద్ధి రాష్ట్రంలో ఏది అని కేంద్ర హోంమంత్రి నిలదీశారు. ఆ డబ్బంతా జగన్ ప్రభుత్వ అవినీతి ఖాతాల్లోకే వెళ్తుందని ఆయన ఆరోపించారు. విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చేపట్టామని.. భోగాపురం విమానాశ్రయానికి అనుమతులు ఇచ్చామని అమిత్ షా గుర్తుచేశారు. విశాఖ, కాకినాడ, తిరుపతి, అమరావతిని స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు.
