విశాఖలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బును తామే ఇస్తున్నట్లు జగన్ చెబుతున్నారని ఆయన దుయ్యబట్టారు. 

9 ఏళ్ల మోడీ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదన్నారు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆదివారం విశాఖలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. పదేళ్ల యూపీఏ పాలనలో అన్నీ కుంభకోణాలేనన్నారు. యూపీఏ పాలనలో రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని అమిత్ షా ఆరోపించారు. పుల్వామా దాడి ఘటన తర్వాత పది రోజుల్లోనే పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పామని హోంమంత్రి గుర్తుచేశారు.

మోడీ వచ్చాక మనదేశం పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోందని అమిత్ షా పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మోడీ నినాదమే వినిపిస్తోందని ఆయన తెలిపారు. రైతుల ఆత్మహత్యలపై వైసీపీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో వుందని.. కానీ జగన్ తమది రైతు ప్రభుత్వమంటున్నారని అమిత్ షా దుయ్యబట్టారు. రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బును తామే ఇస్తున్నట్లు జగన్ చెబుతున్నారని.. మోడీ ఉచితంగా ఇచ్చే బియ్యంపైనా జగన్ ఫోటోలు వేసుకున్నారని ఆయన మండిపడ్డారు.

జగన్ పాలనలో విశాఖ అరాచక శక్తులకు అడ్డాగా మారిందని అమిత్ షా ఆరోపించారు. పదేళ్లలో ఏపీ అభివృద్ధికి రూ.5 లక్షల కోట్లు ఇచ్చామని ఆయన తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులకు తగినట్లుగా రాష్ట్రంలో అభివృద్ధి కనిపిస్తుందా అని అమిత్ షా ప్రశ్నించారు. రూ.5 లక్షల కోట్ల అభివృద్ధి రాష్ట్రంలో ఏది అని కేంద్ర హోంమంత్రి నిలదీశారు. ఆ డబ్బంతా జగన్ ప్రభుత్వ అవినీతి ఖాతాల్లోకే వెళ్తుందని ఆయన ఆరోపించారు. విశాఖ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు చేపట్టామని.. భోగాపురం విమానాశ్రయానికి అనుమతులు ఇచ్చామని అమిత్ షా గుర్తుచేశారు. విశాఖ, కాకినాడ, తిరుపతి, అమరావతిని స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఏపీకి అనేక కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు ఇచ్చామని అమిత్ షా వెల్లడించారు. ఐఐటీ తిరుపతి, ఐఐఎం విశాఖ సహా 3 వైద్య కళాశాలలు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యంపైనా జగన్ ఫోటోలా అంటూ అమిత్ షా మండిపడ్డారు. 300 సీట్లతో మరోసారి మోడీ ప్రధాని కావడం ఖాయమని కేంద్ర హోంమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఏపీ నుంచి 20 లోక్‌సభ స్ధానాలు బీజేపీ గెలవాలని ఆయన ఆకాంక్షించారు. జగన్ ప్రభుత్వ నాలుగేళ్ల పాలనలో అవినీతీ, కుంభకోణాలు చోటు చేసుకున్నాయన్నారు అమిత్ షా. జగన్ పాలనలో అవినీతి, కుంభకోణాలు తప్పించి మరేం లేదన్నారు.