టీడీపీ , జనసేనల్లో జగన్ కోవర్టులను పెట్టారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌వి, నావి ఆలోచనలు ఒక్కటేనని.. మాలో విభేదాలు సృష్టించలేరని దుయ్యబట్టారు . పులివెందుల పంచాయితీ చేస్తే కుర్చీని మడిచి మీ ఊరికి పంపుతామని ఆయన హెచ్చరించారు. 

హూ కిల్డ్ బాబాయ్.. జగన్ ఇప్పటికైనా సమాధానం చెప్పాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. శనివారం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో ఏర్పాటు చేసిన ‘‘రా .. కదలిరా’’ సభలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయన పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చంద్రబాబు ప్రసంగిస్తూ.. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా సిద్ధం కావాలన్నారు. పల్నాడు జిల్లాలో తలపెట్టిన వాటర్‌గ్రిడ్, వరికిపుడిసెల ఎత్తిపోతలను ఏడాదిలోగా పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 

వచ్చే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా ఓటు వేయాలని.. వైసీపీ ప్రభుత్వం పనైపోయిందని పోలీసులు కూడా గ్రహించాలన్నారు. బాబాయ్‌ను ఎవరు చంపారో చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలని.. హత్యలు చేసేవారు రాజకీయాలకు పనికిరారని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అన్న పార్టీకి ఓటు వేయొద్దని ఎంతో బాధతో మీ చెల్లెలు చెప్పిందని ఆయన దుయ్యబట్టారు. సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి.. రాష్ట్ర ప్రజలకు న్యాయం చేస్తాడా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్‌ది యూజ్ అండ్ త్రో విధానమని.. ఆయన టిష్యూ పేపర్‌లా వాడుకుంటారని టీడీపీ చీఫ్ దుయ్యబట్టారు. 

మరో 40 రోజుల్లో జగన్‌ను ఇంటికి పంపేందుకు జనం సిద్ధంగా వున్నారని.. బెంగళూరు, కడప, ఇడుపులపాయ, తాడేపల్లి, హైదరాబాద్‌లో జగన్‌కు ప్యాలెస్‌లు వున్నప్పటికీ.. రుషికొండలో మరో ప్యాలెస్ కట్టారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఎన్నో త్యాగాలు చేశారని ఆయన వెల్లడించారు. టీడీపీ , జనసేనల్లో జగన్ కోవర్టులను పెట్టారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌వి, నావి ఆలోచనలు ఒక్కటేనని.. మాలో విభేదాలు సృష్టించలేరని దుయ్యబట్టారు. అప్పులు చేయడం తప్పించి.. సంపద సృష్టించి ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ టీడీపీ అన్నారు. 

తీవ్రవాదులు , ముఠా నాయకులను అణచివేసింది తామేనని.. పల్నాడు జిల్లాలోని నరహంతకులను వదిలిపెట్టేది లేదన్నారు. అభివృద్ధికి టీడీపీ మారు పేరని, విధ్వంసానికి వైసీపీ చిరునామా అని దుయ్యబట్టారు. తాగునీటి కోసం వచ్చిన ఎస్టీ మహిళను ట్రాక్టర్‌తో తొక్కించి చంపారని, ఏ తప్పూ చేయని ప్రత్తిపాటి శరత్‌ను అరెస్ట్ చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల పంచాయితీ చేస్తే కుర్చీని మడిచి మీ ఊరికి పంపుతామని ఆయన హెచ్చరించారు.