Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉన్నాం.. ఆ ప్రచారం గురించి నేను కూడా విన్నాను: చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) ముందస్తు ఎన్నికల ప్రచారం గురించి తాను కూడా విన్నానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. తెలంగాణ‌తో పాటు.. ఏపీ ముందుగానే ఎన్నికలకు వెళ్లనుందని ప్రచారం జరుగుతుందన్నారు. 

TDP Chief Chandrababu naidu Sensational comments about Early elections
Author
Mangalagiri, First Published Jan 1, 2022, 4:58 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికల ప్రచారం గురించి తాను కూడా విన్నానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. తెలంగాణ‌తో పాటు.. ఏపీ ముందుగానే ఎన్నికలకు వెళ్లనుందని ప్రచారం జరుగుతుందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన తాము సిద్దంగా ఉన్నామని వెల్లడించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. టీడీపీ చేసిన అభివృద్ది కంటే జగన్ ఏదో చేస్తారని ప్రజలు భావించారని చంద్రబాబు అన్నారు. YS Jagan అడిగిన ఒక్క అవకాశం ప్రజలు ఇచ్చారని.. ఇప్పుడు భ్రమలు తొలుగుతున్నాయని అన్నారు. సంక్షేమం కింద ఇచ్చేదాని కంటే ప్రజలపై మోపే భారం 3 రెట్లు ఎక్కువగా ఉందని విమర్శించారు. ఆదాయం, ఖర్చును ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని అన్నారు. 

ఏపీలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతిందని.. పంటల పర్యవేక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని చంద్రబాబు విమర్శించారు. వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం చేసింది శూన్యం అని అన్నారు. అన్నపూర్ణ లాంటి రాష్ట్రం.. పంట దిగుబడిలో వెనకబడిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఈ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతుందని విమర్శించారు. 

పారిశ్రామిక వేత్త నుంచి కూలీ వరకు అంతా పక్క రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని అన్నారు. ఒకప్పుడు భువనేశ్వర్ నుంచి విశాఖకు వలస వచ్చేవారని.. ఇప్పుడు ఏపీ నుంచి భువన్వేశర్‌కు వలస వెళ్లే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఈ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిందన్నారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీశారని.. ఏసీబీ, సీఐడీ‌లతో అందరినీ బెదిరిస్తున్నారని విమర్శించారు. కరోనాతో జనం రోడ్డెక్కలేదని.. అందుకే జగన్ బతికిపోయారని కామెంట్స్ చేశారు.

ప్రజలల్లో జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ ప్రభుత్వంపై మరింత విస్తృతంగా పోరాటాలు చేస్తామని చెప్పారు. పనిచేయని పార్టీ నేతలు, ఇన్‌చార్జ్‌లను పక్కన పెడతామని హెచ్చరించారు. పార్టీ ఎవరి కోసం త్యాగాలు చేయదని పేర్కొన్నారు. ఇక, పొత్తులపై ప్రశ్నలు ఊహాజనితమని.. వాటిపై తాను స్పందించనని చంద్రబాబు చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios