విశాఖలో ఏం జరుగుతోంది.. పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ఫోన్, జనవాణికి మద్ధతు
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా విశాఖలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరా తీశారు. పార్టీ అధ్యక్షుడికి ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు వుంటుందని.. జనవాణి కార్యక్రమానికి మద్ధతు తెలిపారు చంద్రబాబు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన దాడికి సంబంధించి జనసేన నేతలను అరెస్ట్ చేయడం, పవన్‌కు పోలీసులు నోటీసులు జారీ చేయడంపై చంద్రబాబు ఆరా తీశారు. ఈ సందర్భంగా పోలీసుల ఆంక్షలు, ప్రభుత్వ వైఖరిని టీడీపీ చీఫ్ తప్పుబట్టారు. పార్టీ అధ్యక్షుడికి ప్రజల సమస్యలు తెలుసుకునే హక్కు వుంటుందని.. జనవాణి కార్యక్రమానికి మద్ధతు తెలిపారు. దీనిపై పవన్ స్పందిస్తూ.. తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడం, తమ నేతల అరెస్ట్‌లు తదితర అంశాలపై చంద్రబాబుకు వివరించారు. ప్రతిపక్ష నేతల కార్యక్రమాలకు అడ్డంకులు సృష్టించడం సరికాదని చంద్రబాబు అన్నారు. విపక్ష నేతలను దూషించడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అధికార పక్షం తట్టుకోలేకపోతోందని పవన్‌తో చంద్రబాబు అన్నారు.
అంతకుముందు బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు కూడా పవన్‌కు ఫోన్ చేశారు. పోలీసులిచ్చిన నోటీసులో ప్రస్తావించిన అంశాల గురించి సోము వీర్రాజు అడిగి తెలుసుకున్నారు. నిన్న విశాఖపట్టణంలో ఏం జరిగిందనే విషయమై కూడా పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు చర్చించారు. జనసేనపై ఏపీ మంత్రులు పవన్ కళ్యాణ్ పై చేసిన విమర్శలపైనా బీజేపీ మండిపడిన సంగతి తెలిసిందే. ఇవాళ విజయవాడలో జరిగిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో విశాఖలో జరిగిన ఘటనలపై చర్చించారు.
Also Read:నేరస్తుడికి అధికారమిస్తే ఇలానే ఉంటుంది: జగన్ పై పవన్ కళ్యాణ్ ఫైర్
కాగా.. పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. నేరస్తుడి చేతిలో అధికారంలో ఉంటే ఇలానే ఉంటుందని రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిస్థితులపై విమర్శించారు. విశాఖ పోలీసులు పవన్ కళ్యాణ్ కు ఆదివారం నాడు నోటీసులు అందించారు. ఈ నోటీసులు అందుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. తాను విశాఖపట్టణానికి రాకముందే గొడవ జరిగిందన్నారు. కానీ తాము రెచ్చగొట్టడంవల్లే గొడవ జరిగిందని పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ప్రజల కోసం పోరాడితే నోటీసులు ఇచ్చారన్నారు.
సవాళ్లను ఎదుర్కొనేందుకు జనసేన సిద్దంగా ఉందన్నారు..ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు వెళ్లేందుకు కూడా తాము సిద్దంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ తేల్చిచెప్పారు. గొంతెతొద్దు, ప్రశ్నించొద్దంటే ఎలా అని ఆయన అడిగారు. అడిగేవాళ్లు లేరని ఇష్టానుసారం చేస్తున్నారని జగన్ సర్కార్ పై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. బలహీనుల విషయంలో పోలీస్ శాఖ బలంగా పనిచేస్తుందన్నారు. ఎదురు దాడి చేసేవారి విషయంలో చాలా బలహీనంగా పనిచేస్తుందని ఆయన విమర్శించారు. ఉత్తరాంధ్ర దోపిడీని చూపిస్తామని డ్రోన్లను నిషేధించారన్నారు. రాజకీయాల్లో నేర చరిత్ర గల నేతలు పోవాలంటే ప్రజల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.