రాష్ట్రంలో వరుసగా చోటు చేసుకుంటున్న హత్యల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. 

వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వరుస హత్యలు, అత్యాచారాలు, హింసాత్మక దాడులు, బెదిరింపులు, వేధింపులు..పోలీసులలో కొందరు అధికార వైకాపా నాయకులతో కుమ్మక్కు అయ్యారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల ప్రజల ప్రాణాలకు, జీవనోపాధికి, ఆస్తులకు భద్రత లేకుండా పోయింది. ఎన్నికైన వైకాపా ప్రజాప్రతినిధులే ఈ దాడులకు నాయకత్వం వహించడంతో ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు.

డిసెంబర్ 24న తాడిపర్తి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కత్తులు, గొడ్డళ్లు, మారణాయుధాలతో తన అనుచరులను వెంటేసుకుని టిడిపి నాయకుడు జెసి ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడిచేశారు. పట్టపగలు ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేకుండా చూసి ఈ దాడికి పాల్పడ్డారు. వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి స్వయంగా ఈ దాడిలో పాల్గొనడమే కాకుండా దానికి నాయకత్వం వహించాడు, ప్రభాకర్ రెడ్డి అనుచరుడిని తీవ్రంగా గాయపరిచారు.  

యూనిఫామ్ వేసుకున్న పోలీసులే ఈ దాడిని ఆపే ప్రయత్నం చేయకుండా ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడికి సహకరించడం, ప్రోత్సహించడం జరిగింది. పట్టపగలే ఈ దాడి జరిగినప్పటికీ, సిసి టివి ఫుటేజి సాక్ష్యంగా ఉన్నప్పటికీ(వీడియో కూడా జతపరిచాం), దాడి చేసినవారిపై పోలీసులు కేసులు పెట్టడానికి బదులుగా, బాధితులపైనే కేసులు పెట్టడంపైనే శ్రద్దాసక్తులు చూపారు. తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ లో డిసెంబర్ 25న నమోదైన ఎఫ్ ఐఆర్ లు  848/2020, 849/2000, 850/2020 లే దీనికి నిదర్శనం. ప్రతిపక్షాల నాయకులను ప్రభుత్వమే వేధిస్తోంది అనడానికి ఈ సంఘటనలే అద్దం పడుతున్నాయి. 

వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ తో మాట్లాడిన మాటలే ఉదాహరణ. ‘‘జెసి ప్రభాకర్ రెడ్డిని రమ్మనండి, ఇద్దరం చూసుకుందాం, మాలో ఎవరో ఒకరే మిగుల్తాం’’ (వీడియో జతపరిచాం) అన్న పెద్దారెడ్డి వ్యాఖ్యలే దీనికి దృష్టాంతం. ప్రతిపక్ష నాయకుడికి ఈవిధంగా అధికార పార్టీ ఎమ్మెల్యే హెచ్చరించడం చూస్తుంటే పోలీసులలో కొందరు ఈ దాడులను  ఎలా ప్రోత్సహిస్తున్నారో విదితం అవుతోంది.

అధికార పార్టీకి చెందిన ఎన్నికైన ప్రజాప్రతినిధి బరితెగించి ఇలా హింసాత్మక దాడులకు తెగబడటం చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులెలా ఉన్నాయో ఎవరైనా ఊహించుకోవచ్చు. హింసాత్మక దాడులు, దౌర్జన్యకాండవైపు ముఖ్యమంత్రి స్వయంగా అధికార వైకాపా నాయకులను ప్రేరేపిస్తున్నారు..ఇటువంటి హింసాత్మక దాడులతో రాష్ట్ర ప్రజలను, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ శ్రేణులను భయపెట్టలేరు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మరియు చట్టబద్ద పాలన(రూల్ ఆఫ్ లా) పూర్తిగా పతనావస్థకు చేరాయి. ఈ దాడులు, దౌర్జన్యాలు మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో మీరు తక్షణమే జోక్యం చేసుకుని రాజ్యాంగాన్ని పరిరక్షించాలి, రాష్ట్రంలో పాలనను చక్కదిద్దాలి. ఈ దాడిలో పాల్గొన్న వైకాపా ఎమ్మెల్యేను, అతని అనుచరులను, వారితో కుమ్మక్కైన కొందరు పోలీసులను కఠినంగా శిక్షించి న్యాయాన్ని నిలబెట్టాలి. జెసి ప్రభాకర్ రెడ్డికి, ఆయన కుటుంబానికి తక్షణమే పూర్తి భద్రత కల్పించాలి. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలి. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం, రూల్ ఆప్ లా ను అమలు చేయడం, ప్రాధమిక హక్కులను కాపాడటం ద్వారా ప్రజల్లో రాజ్యాంగం పట్ల నమ్మకం, ప్రభుత్వం పట్ల విశ్వాసం పెంచాలని ఆయన కోరారు.