తెలుగు సినీ నిర్మాత అట్లూరి నారాయణ రావు రూపొందించిన ‘దగాబడ్డ ఆంధ్ర రాష్ట్రమా’ అనే గీతాన్ని టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఇలాంటి పాటలు మరిన్ని రావాల్సిన అవసరం వుందని ఆయన పేర్కొన్నారు.
ప్రముఖ సినీ నిర్మాత అట్లూరి నారాయణరావు (atluri narayana rao) ఆధ్వర్యంలో రూపొందించిన ‘దగాబడ్డ ఆంధ్ర రాష్ట్రమా’ అనే గీతాన్ని టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ అరాచకాలను, వైఫల్యాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు తెలియజేసేలా రూపొందించిన ఈ పాట సందేశాత్మకంగా ఉందని ప్రశంసించారు. ప్రజలను ఉత్తేజపరిచేలా మరిన్ని పాటలను రూపొందించాలని చంద్రబాబు సూచించారు. అట్లూరి నారాయణరావు మాట్లాడుతూ చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఈ పాటను రూపొందించడం ఆనందంగా వుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు వర్ల రామయ్య, బుచ్చయ్య చౌదరి, ధూళిపాళ్ల నరేంద్ర, వైవీబీ రాజేంద్రప్రసాద్, టిడి జనార్థన్, కూన రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు.. బుధవారం 73వ పుట్టిన రోజు (chandrababu birth day) జరుపుకుంటున్న చంద్రబాబు.. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మను (kanaka durga temple vijayawada) దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రిపై ఆలయ మర్యాదలతో చంద్రబాబుకు అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం తర్వాత చంద్రబాబు వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు.. అమ్మవారి చిత్ర పటం, తీర్ధ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. చంద్రబాబుతో పాటు దుర్గమ్మను దర్శించుకున్నవారిలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, బుద్ద వెంకన్న కూడా ఉన్నారు.
అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల తరఫున నిబలడి, వారి కష్టాలను తొలగించే శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. ప్రజలకున్న ఇబ్బందులను తొలగించాలని వేడుకున్నట్టుగా తెలిపారు. తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ఇందులో తప్పకుండా విజయం సాధిస్తాననే నమ్మకం ఉందన్నారు. రాజీ లేని పోరాటంతో ప్రజలకు అండగా నిలబడతానని చంద్రబాబు చెప్పారు. ప్రపంచంలో తెలుగు వాళ్లు ఎక్కడున్నా.. వారి సంక్షేమం కోసం టీడీపీ పోరాడుతుందన్నారు. తాను ఇక్కడ రాజకీయాలు మాట్లాడబోనని ఆయన తెలిపారు.
