గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్లకి డబ్బులు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం హింసిస్తోందని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. మంగళవారం అసెంబ్లీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా ఒక్క ఇల్లు కూడా కట్టలేదని ఎద్దేవా చేశారు.

అధికార పార్టీ మాయమాటలు చెబుతోంది కానీ చేతలు లేవన్నారు. ఎదురుదాడి చేస్తూ తమ నోరు మూయించాలని చూస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదల ఇళ్ల స్థలాల పంపిణీకి తాము అడ్డుపడ్డామంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని.. ఎక్కడ అడ్డుపడ్డామో చెప్పాలని ఆయన నిలదీశారు. స్థానికంగా అన్యాయం జరిగిన వాళ్లు కోర్టులను ఆశ్రయించారని చెప్పారు.

పేదల ఇళ్ల స్థలాలకు అసైన్‌మెంట్‌ భూములు, ఆవ భూములు, ఆట స్థలాలు, శ్మశానాలు ఇస్తారా? అని టీడీపీ అధినేత మండిపడ్డారు. ఇళ్ల స్థలాల వ్యవహారంలో రూ.4వేల కోట్ల అవినీతి జరిగిందని.. ధైర్యముంటే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ కోరాలని డిమాండ్‌ చేశారు.

వైసీపీ నేతలు చెప్పేమాటలకు, చేసే పనులకు పొంతన లేదని ధ్వజమెత్తారు. అన్ని కేటగిరీల్లో టిడ్కో ఇళ్లన్నీ ఉచితంగా ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ఆ ఇళ్లు ఎప్పటిలోగా పూర్తిచేస్తారో స్పష్టం చేయాలని.. బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు