గుంటూరు జిల్లా తాడికొండలో ఇటీవల గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా వైసీపీ నేతలను నిలదీసిన వెంకాయమ్మ, ఆమె కుమారుడిపై అధికార పక్షానికి చెందిన కొందరు కార్యకర్తలు దాడి చేశారు. ఆమెను పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి నక్కా ఆనందబాబుపైనా ఏకంగా పోలీస్ స్టేషన్‌లో దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.  

గుంటూరు జిల్లా (guntur) తాడికొండ (tadikonda) మండలం కంతేరులో టీడీపీ (tdp) అభిమాని వెంకాయమ్మ (venkayamma) , ఆమె కొడుకుపై వైసీపీ (ysrcp) కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను తాడికొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సమాచారం అందుకున్న మాజీ మంత్రి , టీడీపీ నేత నక్కా ఆనంద బాబు (nakka anand babu) .. వెంకయమ్మను పరామర్శించడానికి పీఎస్‌ వద్దకు వచ్చారు. దీంతో వైసీపీ శ్రేణులు ఆయనపైనా దాడికి దిగాయి. దీనిని టీడీపీ వర్గీయులు సైతం తీవ్రంగా ప్రతిఘటించడంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. 

Also REad:గడప గడపకు మన ప్రభుత్వం ... జగన్ పరువు తీసిన వెంకాయమ్మ, ఆమెకు ఏమైనా జరిగితే : నారా లోకేష్ వార్నింగ్

ఈ ఘటనపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. వైసీపీ రౌడీ షీటర్ వచ్చి అల్లర్లు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని.. ఏకంగా పోలీస్ స్టేషన్లో వెంకయమ్మపై దాడి చేసినా పోలీసులు ఏం చేయలేకపోతున్నారని ఆనందబాబు విమర్శించారు. అధికారులు వైసీపీకి వత్తాసు పలుకుతున్నారని.. దాడులు చేసిన వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామని ఆయన తెలిపారు. మానవ హక్కులు, ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని, తన జీవితంలో ఇంత దారుణమైన ప్రభుత్వం ఏనాడు చూడలేదంటూ ఆనంద బాబు దుయ్యబట్టారు.

మరోవైపు ఈ ఘటనపై ఏపీ డీజీపీ (ap dgp) రాజేంద్రనాథ్‌ రెడ్డికి (rajendranath reddy) టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) లేఖ రాశారు. ప్రభుత్వ తప్పులు ఎత్తిచూపితే దాడులు పరిపాటిగా మారాయని... విమర్శించేవారిని భయపెట్టాలని చూస్తున్నారన్నారని చంద్రబాబు మండిపడ్డారు. పోలీసుల సహకారంతోనే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. వెంకాయమ్మ కుమారుడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని, ఆమె కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. డీజీపీకి లేఖతో పాటు పలు వీడియోలను ఆయన ఫిర్యాదుతో జత చేశారు.