వైసీపీ నిర్వహిస్తున్న ‘‘గడప గడపకు మన ప్రభుత్వం’’ కార్యక్రమంలో ఎమ్మెల్యేను నిలదీసిన దళిత మహిళ వెంకాయమ్మ భద్రతపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమెకు ఏమైనా జరిగితే వైసీపీ ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
వైఎస్ జగన్ ప్రభుత్వం (ys jagan) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘‘గడప గడపకు మన ప్రభుత్వం’’ (gadapa gadapaku mana prabhutvam) కార్యక్రమానికి జనం నుంచి నిరసన సెగ ఎదురవుతోంది. అనేక ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో వెంకాయమ్మ (venkayamma) అనే మహిళ వైసీపీ (ysrcp) నేతలను నిలదీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ (nara lokesh) స్పందించారు.
జగన్ పాలనలో పేదల పరిస్థితి అధ్వానంగా ఉందంటూ ఐదు కోట్ల ఆంధ్రుల అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన దళిత మహిళ కర్లపూడి వెంకాయమ్మకి సమాధానం చెప్పే దమ్ములేని వైసీపీ నాయకులు కంతేరులోని ఆమె ఇంటిపై దాడి చేసి బెదిరిస్తారా? అని లోకేశ్ మండిపడ్డారు. వెంకాయమ్మకి గానీ, ఆమె కుటుంబసభ్యులకి గానీ ఎటువంటి హాని తలపెట్టినా తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు. మీ దగ్గర వున్నది కిరాయి మూకలని... తమ దగ్గర ఉన్నది పార్టీ అంటే ప్రాణం పెట్టే లక్షలాది మంది సైనికులని లోకేష్ చెప్పారు. నిరక్షరాస్య, నిరుపేద, దళిత మహిళ వెంకాయమ్మ మాటే ఏపీలో ప్రతీ ఇంటా, ప్రతీ నోటా వినిపిస్తోందని... ఈ ఐదు కోట్ల మంది పైనా దాడి చేయిస్తారా జగన్‌రెడ్డి గారు? అని లోకేశ్ ట్వీట్ చేశారు.
తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు వైసిపి ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధికి (kokkiligadda rakshana nidhi) సొంత నియోజకవర్గంలో చుక్కెదురయ్యింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన ఇవాళ (మంగళవారం) ఎ.కొండూరు మండలం కోడూరులో పర్యటించారు. ఈ క్రమంలోనే ప్రజలతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఓ మహిళ ఎమ్మెల్యేను నిలదీసింది.
వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క మంచి పనైనా చేసారా? అంటూ ఎమ్మెల్యే రక్షణనిధిని నడిరోడ్డుపై అందరిముందే ఓ మహిళ నిలదీసింది. గూడు లేని నిరుపేదలకు పక్కా ఇళ్లు కట్టివ్వకుండా, మౌళిక సదుపాయాల్లో అతి ముఖ్యమైన రహదారులను బాగుచేయలేదని, దీంతో రోడ్లన్ని అధ్వానంగా మారాయని మహిళ తెలిపింది. ఇక జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించుకోలేని పరిస్థితి ఉందంటూ సదరు మహిళ ఎమ్మెల్యేను నిలదీసింది.
అడ్డమైన పథకాలు పెట్టారు... ఒక్క మంచి పనైనా చేసారా అంటూ ఎమ్మెల్యే ముందే మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలా పలు సమస్యలను ఎమ్మెల్యే వద్ద ఏకరవు పెట్టింది సదరు మహిళ. అయితే ఇవన్నీ నీకేందుకు... నీ వ్యక్తిగత సమస్య ఏమయనా వుంటే అడగాలని వైసిపి నాయకులు తప్పించుకునే ప్రయత్నం చేసారు. ఇలా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రక్షణనిధికి చేదు అనుభవం ఎదురయ్యింది.
ఇక ఇలాంటి అనుభవమే మంత్రి గుమ్మనూరు జయరాంకు (gummanur jayaram) ఎదురయ్యింది. ఇటీవల కర్నూలు జిల్లా అలూరు మండలం హాత్తిబెళగల్ గ్రామంలో గడప గడపకు వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. అమ్మ ఒడి లేకున్నా సరే... అద్వాన్నంగా మారిన రోడ్డు వేయించాలని మంత్రిని స్థానికులు నిలదీశారు. తమకు అమ్మఒడి రాలేదని చెప్పిన కొందరు మహిళలు... ఆ డబ్బులు ఇవ్వకపోయినా సరే తమకు రోడ్లు వేయించాలని కోరారు. అంతేకాకుండా మంత్రి ముందు పలు సమస్యలను ప్రస్తావించారు. త్రాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. దీంతో మంత్రి వాటిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.
