వాళ్ల ఇళ్లు వాళ్లే తగులబెట్టుకుని, అంతా పోలీసుల ఎదుటే.. కోనసీమ అల్లర్లు వైసీపీ పనే : చంద్రబాబు వ్యాఖ్యలు
కోనసీమ ఘటనలో వైసీపీ నేతలు వాళ్ల ఇళ్లను వారే తగులబెట్టుకున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వీళ్లు ఆపితే మహానాడు ఆగుతుందా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని జగన్ నడపలేరని అందుకే మధ్యంతరానికి రెడీ అవుతున్నారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కోనసీమ ఘటనపై (konaseema violence) టీడీపీ (tdp) అధినేత , ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) స్పందించారు. రేపు మహానాడు నేపథ్యంలో గురువారం మంగళగిరి నుంచి ఒంగోలుకు ఆయన ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో చిలకలూరిపేట వద్ద చంద్రబాబు ఆగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కోనసీమని వైసీపీ మనుషులే తగులపెట్టారని.. అందమైన కోనసీమలో చిచ్చు పెట్టిన ఘనత వైసీపీదేనంటూ దుయ్యబట్టారు.
పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశారని.. మంటలను అదుపు చేసేందుకు ఫైరింజన్ కూడా రాలేదని చంద్రబాబు గుర్తుచేశారు. వాళ్ల ఇళ్లను వాళ్లే తగులపెట్టుకుని వేరే వాళ్లపై నిందలేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పులు చేసి.. ఆ నేరాన్ని ప్రతిపక్షాల మీద తోయడం జగనుకు అలవాటుగా మారిందని చంద్రబాబు దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని జగన్ నడపలేరని.. మధ్యంతరానికి సిద్దపడుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ ఎన్టీఆర్ (ntr) పెట్టిన పార్టీ అని...తెలుగుదేశం (telugdu desam ) కార్యకర్తలెవరూ భయపడరని, జగన్ చేస్తోన్న దానికి ఇంతకు ఇంత చెల్లిస్తానని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఆర్టీసీ బస్సులకు చలానాలు కడతామన్నా బస్సులు ఇవ్వరా అంటూ ఫైరయ్యారు. మహానాడుకు బస్సులివ్వకుండా.. ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్లని భయపెడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాష్ట్రం వైసీపీ అబ్బ జాగీరా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఆయన.. జగన్ ఓ చిల్లర ముఖ్యమంత్రి అంటూ ఎద్దేవా చేశారు.
మహానాడుకు నడిచైనా.. ఎడ్లబళ్లల్లోనైనా రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్.. ఇదే మహానాడు నినాదమన్నారు. ఏ ఒక్క వర్గం బాగుందన్నా.. తిరిగి అమరావతికి వెళ్లిపోతానని ఆయన సవాల్ విసిరారు. వైసీపీలో సామాజిక న్యాయం లేదని.. ఉత్తరాంధ్ర, రాయలసీమలపై ప్రేమ లేదు.. అందుకే రాజ్యసభ స్థానాలు ఈ ప్రాంతాలకు కేటాయించ లేదని చంద్రబాబు ఆరోపించారు. విశాఖ మీద ప్రేముంది.. రాజధాని తీసుకెళ్తానన్నవాడు.. రాజ్యసభ స్థానాలు ఎందుకు కేటాయించ లేదని ఆయన ప్రశ్నించారు.
Also Read:దావోస్‌లో ఏపీకి పెట్టుబడులు రాకూడదనే.. కోనసీమ అల్లర్లు వెనుక చంద్రబాబు : విజయసాయిరెడ్డి ఆరోపణలు
తొమ్మిది మంది రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు ముద్దాయిలే ఉన్నారని.. ఏ ముఖం పెట్టుకుని బస్ యాత్ర చేపడతారంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. ఎస్సీలకు చెందిన 28 స్కీములు రద్దు చేశారని.. డబ్బులున్న వాడికి ఊడిగం, పేదవాళ్లను దోచుకోవడమే జగన్ థియరీ అంటూ కామెంట్ చేశారు. బీసీ పథకాలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసిందని.. దావోస్‌కు వెళ్లి అదానీ, గ్రీన్ కో తో ఒప్పందాలు చేసుకున్నారని చంద్రబాబు తెలిపారు. టీడీపీ ప్రభుత్వంలో ఒప్పందాలు చేసుకున్న అదానీ, గ్రీన్ కో తో ఒప్పందాలు కొనసాగించారు కానీ.. అన్న క్యాంటీన్లు కొనసాగించరా అని ఆయన ప్రశ్నించారు.
వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు (ysrcp mlc ananthababu) డ్రైవరును చంపేస్తే.. కప్పి పుచ్చే ప్రయత్నం చేశారని, టీడీపీ పోరాడితే కేసు నమోదు చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. అనంతబాబు వ్యవహరంలో వైసీపీని ప్రజలు ఛీ కొట్టారని ఆయన పేర్కొన్నారు. మీరు ఆపితే మహానాడు ఆగుతుందా.. మహానాడు ఓ ప్రభంజనమని చంద్రబాబు అన్నారు.