ఎవరిది స్వర్ణ యుగమో, ఎవరిది రాతి యుగమో తేలుద్దాం , చర్చకు రా : జగన్‌కు చంద్రబాబు సవాల్

రాప్తాడులో జరిగిన వైసీపీ సిద్ధం సభలో తమపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు . ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతియుగమో తేలుద్దామని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

tdp chief chandrababu naidu challenge to ap cm ys jagan ksp

రాప్తాడులో జరిగిన వైసీపీ సిద్ధం సభలో తమపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్‌తో చర్చకు తాను సిద్ధమని.. తనతో చర్చకు వచ్చే దుమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని.. అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో చర్చిద్దామన్నారు. ఎవరి పాలన స్వర్ణయుగమో, ఎవరి పాలన రాతియుగమో తేలుద్దామని చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో ఎక్కడ చూసినా అభివృద్ధి కాదు.. విధ్వంసం కనిపిస్తోందని, ప్రజలు ఇచ్చిన ఒక్క ఛాన్సే జగన్‌కు చివరి ఛాన్స్ అని ఆయన జోస్యం చెప్పారు. రూ.10 ఇచ్చి .. రూ.100 దోచేశారని.. అలాంటి జగన్ సంక్షేమం గురించి చెబుతున్నారని చురకలంటించారు. ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టేందుకు జనం కసిమీద వున్నారని.. ఓటమి భయంతో జగన్ 77 మందిని మడత పెట్టారని, మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలను జనం మడత పెడతారని చంద్రబాబు పేర్కొన్నారు. 

అంతకుముందు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన సిద్ధం బహిరంగ సభలో వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆవేశంగా ప్రసంగించారు. విపక్ష నేతలు చంద్రబాబు , పవన్ కళ్యాణ్‌లపై ఆయన పంచ్‌లు విసిరారు. చంద్రబాబు పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్క పథకం కూడా లేదన్నారు జగన్. నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్, మనకు మధ్య యుద్ధం జరగబోతోందన్నారు. వీళ్లెవరూ మన రాష్ట్రంలో వుండరు, అప్పుడప్పుడు వస్తుంటారని జగన్ ఎద్దేవా చేశారు.

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు పది శాతమైనా అమలు చేశారా అని ప్రశ్నించారు.  మళ్లీ అబద్ధాలు , మోసాలతో చంద్రబాబు వస్తున్నారని .. పెత్తందారులతో యుద్ధానికి మీరు సిద్ధమా అని జగన్ నిలదీశారు. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏ ప్రాంతానికైనా న్యాయం చేశారా అని ఆయన దుయ్యబట్టారు. అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకు అని సీఎం ప్రశ్నించారు. చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలేనని.. విశ్వసనీయతకు , వంచనకు మధ్య యుద్ధం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. 

కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బాబు మార్క్ ఎక్కడైనా వుందా అని జగన్ ప్రశ్నించారు. 1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టలో 10 శాతమైనా అమలు చేశారా అని ఆయన నిలదీశారు. రంగు రంగుల మేనిఫెస్టోతో మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు వస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం ఎవరికీ గుర్తురాదని.. 57 నెలల పాలనలో చిత్తశుద్ధితో పాలన అందించామని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు అబద్ధాలను నమ్మొద్దని ప్రతీ ఇంటికీ వెళ్లి చెప్పాలని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రతీ అవ్వాత, తాత ముఖంలో చిరునవ్వులు చూశామని.. ప్రతీ అక్కచెల్లెమ్మకు ఎంతో మేలు చేశామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. 

మళ్లీ ఫ్యాన్‌కు ఓటేస్తే చంద్రముఖి బెడద ఇక మీకుండదని.. సైకిల్‌కు ఓటేస్తే పేదల రక్తం తాగేందుకు చంద్రముఖి వస్తుందని ఆయన హెచ్చరించారు. మీ ఇంట్లో మంచి జరిగితే జగనన్నకు ఓటు వేయమని చెప్పాలని.. టీడీపీ దేనికి సంసిద్ధమని జగన్ దుయ్యబట్టారు. పేదవాడి బతుకు మార్చేందుకు మనం యుద్ధం చేస్తున్నామని.. చంద్రబాబు పెత్తందారుల తరపున సంసిద్ధం అంటున్నారని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దుష్టచతుష్టం బాణాలకు తలవంచేందుకు ఇక్కడ వున్నది అభిమన్యుడు కాదు.. ఇక్కడ వున్నది అర్జునుడని, అతనికి తోడు కృష్ణుడి రూపంలో ప్రజలున్నారని జగన్ పేర్కొన్నారు. వైసీపీ మీ అందరి పార్టీ అని.. మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదని, ప్రజలతోనే మా పొత్తు అని సీఎం స్పష్టం చేశారు. 

గతంలో లంచాలు పిండుతూ తన వారికే పథకాలిచ్చారని జగన్ ఆరోపించారు. పార్టీలో ప్రతీ కార్యకర్తకూ మీ అన్న జగన్ తోడుగా వుంటాడని హామీ ఇచ్చారు. నాయకుడంటే ప్రతీ కార్యకర్తా కాలర్ ఎగరేసేలా వుండాలని.. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175 అని జగన్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25కి 25 ఎంపీ స్థానాలని సీఎం తెలిపారు. 650 హామీలిచ్చి 10 శాతం కూడా చంద్రబాబు అమలు చేయలేదని .. మేనిఫెస్టోలో వైసీపీ 99 శాతం హామీలు అమలు చేసిందని జగన్ వెల్లడించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios