తనకు భద్రత కుదించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఉండవల్లిలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశమైన ఆయన ప్రజలే తనకు రక్షకులని.. దేవుడు, ప్రజల ఆశీస్సులతోనే అలిపిరి దాడిలో ప్రాణాల నుంచి బయటపడ్డానని తెలిపారు.

రాష్ట్రంలో ప్రతి పౌరుడి రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. గత ఐదు వారాలుగా రాష్ట్రంలో దాడులు, దౌర్జన్యాలు పెరగడం బాధాకరమని.. ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిటే రాష్ట్రాభివృద్ధికి తాను చేసిన కృషి అంతా బూడిద పాలవుతుందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై హోంమంత్రి సుచరిత చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. సాక్షాత్తూ హోంమంత్రే ఎన్నో జరుగుతూ ఉంటాయి. అన్నింటికీ కాపలా ఉంటామా.. అటే సామాన్యుడికి రక్షణ ఎవరిని చంద్రబాబు ప్రశ్నించారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పుడే పెట్టుబడులకు ఆస్కారముంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశానికి సీనియర్ నేతలు కళా వెంకట్రావ్, కోడెల, యనమల, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, చినరాజప్ప తదితరులు హాజరయ్యారు.