అమరావతి: ఏపీ సీఎంఓలో పనిచేసే అధికారులకు పరిపాలనా పరమైన బాధ్యతలను కేటాయిస్తూ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ అంశాలను సంబంధించి  అధికారులకు కొన్ని శాఖాపరమైన బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. ఈ మేరకు ఒక నోట్ కూడా విడుదల చేసింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడు సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ మరింత  శక్తివంతంగా మారారు. 

సీఎంవో సబ్జెక్ట్ ల జాబితాలో అజయ్ కల్లాం పేరు లేకుండా పోయింది. దీంతో ఆయన ఎలాంటి సబ్జెక్ట్ లు లేకుండా కేవలం సలహాదారుగా మిగిలిపోనున్నారు. సీఎంవోల బాధ్యతలు అన్నీ ప్రవీణ్ ప్రకాష్, సాల్మన్ ఆరోగ్యరాజ్, ధనుంజయ్ రెడ్డిల మధ్య పంపిణీ జరిగింది. 

ఇప్పటివరకు మాజీ సీఎస్ అజయ్ కల్లాం సీఎంవోలో అత్యంత కీలకమైన హోం, రెవెన్యూ, ఫైనాన్స్ వంటి కీలక విభాగాల బాధ్యతలు పర్యవేక్షించేవారు. ఇప్పుడు ఆయన పరిధిలో ఉన్న సబ్జెక్ట్ లు అన్నీ తప్పించేశారు. అజయ్ కల్లాంతో పాటు మరో రిటైర్డ్ అధికారి పీవీ రమేష్, జె. మురళీలది అదే పరిస్థితి. పీవీ రమేష్ కు తొలుత కీలక శాఖలు అప్పగించినా మధ్యలో కోత వేసి వైద్యం, విద్య వంటి శాఖలకు పరిమితం చేశారు. ఇప్పుడు సీఎంవో సబ్జెక్ట్ ల జాబితాలోనే ఆయన పేరు లేకుండా పోయింది. 

read more   జగన్ పుట్టిన రోజును దొంగల దినోత్సవంగా ప్రకటించాలి: సీఎస్ కు లేఖ

అధికార వర్గాల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం సబ్జెక్ట్ లు తొలగిస్తున్న విషయం ఆర్డర్ వచ్చే వరకూ అజయ్ కల్లాం, పీవీ రమేష్ కు కూడా తెలియదని చెబుతున్నారు.
 అజయ్ కల్లాం ఎన్నికల ముందు నుంచి కూడా జగన్ తో అత్యంత సన్నిహితంగా ఉండటంతో గ్రామ సచివాలయాల వ్యవస్థ వంటి వాటి విషయంలో కీలక పాత్ర పోషించారనే ప్రచారం వైసీపీ వర్గాల్లో ఉంది. అంతే కాదు ప్రతిపక్షంలో ఉండగా వ్యతిరేకించిన వాటినే అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయటం వంటి వాటి విషయంలో  ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పనిచేయటం ద్వారా అజయ్ కల్లాం  వ్యక్తిగతంగా  తనకు ఉన్న పేరును కూడా దెబ్బతీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో ముఖ్యమైనది భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ఆయన పేరు బాగా దెబ్బతింది. 

కోరితెచ్చిపెట్టుకున్న అజయ్ కల్లాం వంటి వారిని కూడా ఇలా సబ్జెక్ట్ లు లేకుండా చేయటం... అది కూడా పిలిచి ఓ మాట మాత్రంగా కూడా చెప్పకుండా చేశారని ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

గతంలో కేటాయించిన సబ్జెక్ట్ ల కేటాయింపు ఆదేశాలు అన్నింటిని రద్దు  చేస్తూ కొత్తగా ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ కు సాదారణ పరిపాలన శాఖతోపాటు హోం, రెవెన్యూ, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, న్యాయ, లెజిస్లేటివ్ వ్యవహారాలు, సీఎంవో ఎస్టాబ్లిష్ మెంట్, ఇతర అనుబంధ విభాగాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలతో పాటు అన్ని అంశాలు ప్రవీణ్ ప్రకాష్ పరిధిలోనే ఉంటాయి. 

సాల్మన్ ఆరోగ్యరాజ్ కు రవాణా, రోడ్లు భవనాల శాఖ, హౌసింగ్,  ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్, ఎడ్యుకేషన్, అన్ని సంక్షేమ శాఖలు, పరిశ్రమలు, వాణిజ్యం, మౌలికసదుపాయాలు, పెట్టుబడుల శాఖ,ఐటి, గనులు, కార్మిక, ఉపాధి కల్పనా శాఖ, కె.. ధనుంజయ్ రెడ్డికి జలవనరులు, ఎన్విరాన్ మెంట్ అండ్ ఫారెస్ట్, మున్సిపల్ అడ్మిస్టేషన్, వ్యవసాయం, అనుబంధ విభాగాలు, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ, ఎనర్జీ, టూరిజం, మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్ , ఫైనాన్స్  కేటాయించారు.