పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు జగన్ సర్కార్ అడ్డంకులు సృష్టించడాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తప్పుబట్టారు. 

అమరావతి: గతకొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమ (telugu film industry)పై జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (pawan kalyan) హీరోగా నటించిన భీమ్లా నాయక్ (bheemla nayak) సినిమా విడుదల సందర్భంగా టికెట్ల ధరలు పెంచుకోడానికి, బెనిఫిట్ షో, ఎక్స్ ట్రా షో లకు ప్రభుత్వం అనుమతివ్వలేదు. దీంతో పవన్ అభిమానులతో, రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. కేవలం రాజకీయంగా పవన్ కల్యాణ్ ను అణగదొక్కడానికే ఆయన సినిమాపై ఇలా కక్షసాధింపుకు దిగారని ఆరోపిస్తున్నారు. 

అయితే ప్రస్తుతం రష్యా (russia) దాడులతో ఉక్రెయిన్ (ukraine) అట్టుడుకుతుంటే... అక్కడి తెలుగు ప్రజలకు కాపాడాల్సింది పోయి భీమ్లా నాయక్ సినిమాను అడ్డుకోవడంపై జగన్ సర్కార్ దృష్టిపెట్టడం దారుణమని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు (chadrababu naidu) మండిపడ్డారు. పవన్ కల్యాణ్ సినిమాపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబుతో పాటు నారా లోకేష్ తప్పుబట్టారు. 

''రాష్ట్రంలో ఏ వ్యవస్థనూ సిఎం వైఎస్ జగన్ (ys jagan) వదలడం లేదు. చివరికి వినోదం పంచే సినిమా రంగాన్ని కూడా తీవ్రంగా వేధిస్తున్నాడు. భీమ్లానాయక్ సినిమా విషయంలో జగన్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వ ఉగ్రవాదాన్ని తలపిస్తుంది'' అని చంద్రబాబు మండిపడ్డారు. 

''రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలు అన్నీ పక్కన పెట్టి...థియేటర్ల దగ్గర రెవెన్యూ ఉద్యోగులను కాపలా పెట్టిన ప్రభుత్వ తీరు తీవ్ర అభ్యంతరకరం. #Ukraine లో చిక్కుకున్న తమ వారిని రక్షించేందుకు దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేస్తుంటే... ఆంధ్ర ప్రదేశ్ సిఎం మాత్రం భీమ్లా నాయక్ పై కక్ష సాధింపు చర్యల్లో బిజీగా ఉన్నారు. తెలుగు దేశం తప్పును ఎప్పుడూ ప్రశ్నిస్తుంది...నిలదీస్తుంది. భీమ్లా నాయక్ విషయంలో వేధింపులు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను'' అంటూ జగన్ సర్కార్ తీరును చంద్రబాబు తప్పుబట్టారు. 

ఇక పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) పేర్కొన్నారు. తాను కూడా వీలైనంత తొందరగా భీమ్లా నాయక్ ను చూసేందుకు ఎదురుచూస్తున్నానని లోకేష్ అన్నారు. 

''అన్ని పరిశ్రమల్లాగే సినీ పరిశ్రమను కూడా సీఎం జగన్ నాశనం చేస్తున్నారు. చివరకు రాష్ట్రాన్ని అడుక్కునే స్థాయికి జగన్ దిగజారుస్తున్నారు. అన్ని కుట్రలను ఛేదించి "భీమ్లా నాయక్" అఖండ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా'' అని లోకేష్ పేర్కొన్నారు. 

ఇదిలావుంటే తమ అభిమాన నటుడు పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాపై కక్షపూరితంగా వ్యవహరించిన జగన్ సర్కార్ అభిమానులు ఆగ్రహంతో వున్నారు. ఈ క్రమంలోనే గుడివాడలో ఓ సినిమా థియేటర్ ఓపెనింగ్ కు వచ్చిన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో పాటు మరో మంత్రి కొడాలి నానిని పవన్ అభిమానులు అడ్డుకున్నారు.

కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని జి3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమానికి మంత్రులిద్దరూ హాజరయ్యారు.అయితే అదే సినిమాలో భీమ్లా నాయక్ సినిమా ప్రదర్శితమవుతుండటంతో భారీగా గుమిగూడిన పవన్ అభిమానులు మంత్రులను అడ్డుకునే ప్రయత్నం చేసారు. జై పవన్ కళ్యాణ్, ప్రభుత్వ మొండి వైఖరి నసించాలంటూ నినదిస్తూ జనసేన జెండాలు, ఎర్ర కండువాలు చేతబట్టి అభిమానులు నిరసనకు దిగారు. దీంతో వెంటనే పోలీసులు రంగప్రవేశం నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.