తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ భోగిమంటలు వేసారు. అనంతరం మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులను పరిశీలించారు.
అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో కలిసి సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని మందడంలో జరుగుతున్న భోగి సంబరాల్లో టిడిపి, జనసేన అధినేతలతో పాటు భారీగా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వయంగా చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి భోగి మంటలను వెలిగించారు. ఈ సందర్భంగా వైసిపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కొన్ని జీవో కాపీలను, ఫోటోలను భోగి మంటల్లో వేసి దహనం చేసారు.
భోగి మంటలు వెలిగించిన తర్వాత మహిళలు వేసిన రంగురంగుల ముగ్గులను చంద్రబాబు, పవన్ పరిశీలించారు. అలాగే గంగిరెద్దులు నృత్యాలు చూస్తూ, కోడి పుంజులను పట్టుకుని ... పక్కా సంక్రాంతి శోభతో నిండిన ప్రాంగణమంతా కలియతిరిగారు. తమ అభిమాన నటుడు పవన్, అభిమాన నాయకుడు చంద్రబాబుతో ఫోటోలు దిగేందుకు మహిళలు, ఇరుపార్టీల కార్యకర్తలు ఎగబడ్డారు.
సంక్రాంతి పండగ పూట సొంతూళ్లకు చేరుకునే ప్రజలకు జగన్ సర్కార్ అరాచక పాలన సాగిస్తోందని తెలియజేసేందుకు టిడిపి వినూత్న నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. 'పల్లె పిలుస్తోంది రా కదలిరా' పేరుతో భోగి మంటల్లో ప్రభుత్వ జీవోలు, వైసిపి ఫోటోలు వేయాలని పిలుపునిచ్చింది. అలాగే గ్రామస్థాయిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుని సమస్యలు, అభివృద్ది పనుల గురించి చర్చించుకోవాలని సూచించింది. అలాగే టిడిపి సూపర్ సిక్స్, యువగళం తదితర అంశాలపై ముగ్గులు వేయాలని... వాటితో సెల్ఫీ దిగి పల్లె పిలుస్తోంది రా కదలిరా హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని టిడిపి పిలుపునిచ్చింది.
Also Read ఉండవల్లి : చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ , తొలిసారిగా కరకట్టకి .. సీట్ల సర్దుబాటుపై చర్చ
ఇదిలావుంటే గత రాత్రి చంద్రబాబు నాయడు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఇరుపార్టీల పొత్తు, ఉమ్మడి మేనిఫేస్టో, నాయకులు, కార్యకర్తల సమన్వయం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు... ఇలా తదితర అంశాలపై సుధీర్ఘ చర్చలు జరిపారు. ముందుగా చంద్రబాబు, పవన్, నాదెండ్ల మనోహర్ కలిసి భోజనం చేసారు. చంద్రబాబు రుచికరమైన ప్రత్యేక వంటకాలు చేయించి పవన్ కు వడ్డించారు. ఇలా సంక్రాంతి పండగ వేళ మన సాంప్రదాయ వంటలను చంద్రబాబు, పవన్ రుచిచూసారు.
భోజనం అనంతరం చంద్రబాబు, పవన్ సుధీర్ఘ చర్చలు జరిపారు. దాదాపు మూడున్నర గంటలపాటు వీరిద్దరు భేటీ అయ్యారు. వైసిపి నుడి భారీగా అసంతృప్త నేతలు టిడిపి, జనసేన పార్టీల్లో చేరేందుకు సిద్దమవుతున్నారు... ఈ విషయంపైనా ఇద్దరు నాయకులు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా పార్టీలో చేర్చుకునే నాయకులతో ఇప్పుడున్న నేతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ... కింది స్థాయి నేతలు, కార్యకర్తల అభిప్రాయాల ప్రకారమే చేరికలు వుండాలని నిర్ణయించారు. వివిధ సమీకరణలను దృష్టిలో వుంచుకుని గెలిచే అభ్యర్ధులను ఎంపిక చేయాలని ... ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటు విషయలో కాస్త పట్టువిడుపు వుండాలని నిర్ణయించారట. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటం, ప్రత్యర్థి వైసిపి ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన ప్రారంభించడంతో ఇకపై వేగం పెంచాలని టిడిపి, జనసేన అధ్యక్షులు చంద్రబాబు, పవన్ భావిస్తున్నారు...ఈ అంశంపైనా ఇరువురు నేతలు చర్చించారు.
